Twitter: దిగివస్తున్న ట్విట్టర్​.. ప్రభుత్వం చెప్పిన వాటిలో 97 శాతం ఖాతాలు బ్లాక్​

  • 1,435 అకౌంట్లలో 1,398 ఖాతాలను బ్లాక్ చేసిన సంస్థ
  • ఖలిస్థానీ లింకులున్న మొత్తం 1,178 ఖాతాల తొలగింపు
  • ప్రభుత్వ ఆందోళనను అర్థం చేసుకుంటామన్న ట్విట్టర్
  • సంస్థ ఉన్నతాధికారులతో ఐటీ కార్యదర్శి చర్చలు
Twitter complies with govt request blocks 97 percent handles

ట్విట్టర్ దిగివస్తోంది. రెచ్చగొట్టే ట్వీట్లు చేసిన అకౌంట్లను తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తోంది. రైతుల ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని పాకిస్థాన్, ఖలిస్థాన్ సానుభూతిపరులు ‘రైతు హత్యల’ పేరిట హాష్ ట్యాగ్ లు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి 1,435 ఖాతాలను తొలగించాల్సిందిగా ట్విట్టర్ కు కేంద్రం నోటీసులిచ్చింది.

అయితే, ప్రభుత్వ ఆదేశాలు భారత చట్టాలకు అనుగుణంగా లేవంటూ ట్విట్టర్ కౌంటర్ ఇచ్చింది. ట్విట్టర్ సమాధానంపై కేంద్రం ఘాటుగానే స్పందించింది. వ్యాపారం చేసుకోవాలంటే ఇక్కడి నిబంధనలు పాటించాల్సిందేనని ఐటీ శాఖ తేల్చి చెప్పింది.

దీంతో కేంద్ర ప్రభుత్వం తొలగించాలన్న ఖాతాల్లో.. 1,398 (97%) ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసినట్టు సమాచారం. గురువారం ఐటీ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్నీ.. ట్విట్టర్ ఉన్నతాధికారులు మోనిగ్ మీచీ, జిమ్ బేకర్ లతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ ఆయా ఖాతాలను బ్లాక్ చేసినట్టు ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ట్విట్టర్ పాటిస్తోందని, ప్రభుత్వం చెప్పిన దాదాపు అన్ని ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేస్తోందని అన్నారు. బ్లాక్ చేయదలిచిన మరికొన్ని ఖాతాలకు సంబంధించి వినియోగదారులకు నోటీసులు పంపించిన తర్వాత చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ చెప్పినట్టు సమాచారం.

పాకిస్థాన్, ఖలిస్థాన్ లింకులున్న 1,178 ఖాతాలను సంస్థ బ్లాక్ చేసిందని, అర్థవంతమైన చర్చల వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆందోళనను తాము అర్థం చేసుకుంటామని ట్విట్టర్ న్యాయ వ్యవహారాల విభాగం వైస్ ప్రెసిడెంట్ బేకర్ చెప్పినట్టు అధికారులు తెలిపారు. ఉల్లంఘనలు చాలా సున్నితమనిపిస్తే నేరుగా ట్విట్టర్ కు ఫిర్యాదు చేయవచ్చని బేకర్ చెప్పారన్నారు.

More Telugu News