తమిళ దర్శకుడు శంకర్ తో చరణ్ సినిమా సెట్ అయింది!

12-02-2021 Fri 10:30
  • చరణ్, శంకర్ లతో పాన్ ఇండియా ఫిలిం 
  • దిల్ రాజు బ్యానర్లో సినిమా నిర్మాణం
  • 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ చేసే ప్రాజక్ట్
Shankar to direct Ram Charan

దక్షిణ భారతంలో దిగ్గజ దర్శకుడిగా శంకర్ కు పేరుంది. భారీ బడ్జెట్టు చిత్రాలకు పెట్టింది పేరు ఆయన. సామాజిక సమస్యలకు వినోదాన్ని రంగరిస్తూ ఆయన రూపొందించే చిత్రాలన్నీ దాదాపు బాక్సాఫీసు వద్ద ఘన విజయాలు సాధిస్తున్నాయి. అందుకే, ఆయనతో ఓ సినిమా అయినా చేయాలని స్టార్ హీరోలంతా ఎదురుచూస్తుంటారు. అలాంటి అవకాశం ఇప్పుడు రామ్ చరణ్ కు వచ్చింది.

శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి గత కొన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజక్టును ఇప్పటికి సెట్ చేసినట్టు తాజా సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో దీనిని భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చరణ్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం పూర్తవగానే శంకర్ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది.

వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి, శంకర్ ల కాంబినేషన్లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలని గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అయితే, అవి కారణాంతరాల వల్ల కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగాస్టార్ తనయుడు చరణ్ హీరోగా శంకర్ సినిమా చేయనుండడం విశేషం!