New Delhi: రెండున్నర గంటల్లో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ కు... 100 కి.మీ. వేగానికి అనుమతి! 

Delhi to Dehradun in Below 3 Hours
  • హైవేతో తగ్గిన 25 కిలోమీటర్ల దూరం
  • ఆరు లైన్లుగా రహదారి నిర్మాణం
  • మధ్యలో 14 టన్నెల్స్, ఆరు ఎలివేటెడ్ వేలు
  • మరో రెండేళ్లలో ప్రజలకు అందుబాటులోకి
దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్... ఈ రెండు ప్రాంతాల మధ్య 235 కిలోమీటర్ల దూరం ఉండగా, ప్రస్తుతం సగటు ప్రయాణ సమయం 6 గంటలకు పైగానే ఉంది. అతి త్వరలో అందుబాటులోకి రానున్న ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రయాణిస్తే, కేవలం రెండున్నర గంటల్లో చేరుకోవచ్చు. ఇప్పటికే రెండు నగరాల మధ్య ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం దాదాపుగా పూర్తి కాగా, గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేందుకు కేంద్రం అనుమతించింది.

అయితే, ఈ మార్గంలో 12 కిలోమీటర్ల రహదారిపై మాత్రం జంతువుల సంచారం అధికమని, ఆసియాలోనే అతిపెద్ద వైల్డ్ లైఫ్ కారిడార్ గా ఈ మార్గం ఉన్నందున ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ ఎక్స్ ప్రెస్ వే కారణంగా రెండు ప్రాంతాల మధ్య ఉన్న దూరం కూడా 25 కిలోమీటర్లు తగ్గిందని, ఢిల్లీ - షహరాన్ పూర్ - డెహ్రాడూన్ మధ్య ఎకనామిక్ కారిడార్ గా ఇది నిర్మితం కాగా, దూరం 210 కిలోమీటర్లకు తగ్గిందని పేర్కొంది.

సాధారణ పరిస్థితుల్లో ఆరున్నర గంటలు పట్టే ప్రయాణం, ఈ రహదారిపై రెండున్నర గంటల్లో పూర్తవుతుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రహదారిపై 25 కిలోమీటర్ల మేరకు బ్రిడ్జ్ లు ఉన్నాయని, మార్గ మధ్యంలో 14 టన్నెల్స్ ఉంటాయని, ఆరు లైన్ల ఎక్స్ ప్రెస్ హైవేగా, దీన్ని నిర్మించామని వెల్లడించింది. మార్గమధ్యంలోని కొన్ని ప్రాంతాల్లో భూ సమీకరణ, పర్యావరణ అనుమతులు తుది దశలో ఉన్నాయని తెలిపింది. మరో రెండేళ్లలోనే ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుందని, ఆపై ఆర్థికంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఎంతో లబ్ది పొందుతుందని కేంద్రం పేర్కొంది.
New Delhi
Dehradun
Exspress Way
Speed

More Telugu News