Automobile: పుంజుకున్న ప్రయాణ వాహన విక్రయాలు... జనవరిలో అమ్మకాల వృద్ధి

  • కరోనా వ్యాప్తి ప్రారంభంలో దెబ్బతిన్న ఆటోమొబైల్ రంగం
  • పడిపోయిన అమ్మకాలు
  • గతేడాది జనవరితో పోల్చితే ఈ జనవరిలో అమ్మకాల హుషారు
  • మెరుగుపడిన ద్విచక్రవాహనాల ఉత్పత్తి
Indian automobile sector picks up in January

కరోనా వ్యాప్తితో కొన్నినెలల కిందట తీవ్ర ఒడిదుడుకులకు లోనైన భారత దేశీయ ప్రయాణ వాహన రంగంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ ఏడాది జనవరిలో కార్లు, ద్విచక్రవాహనాల అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. 2020 జనవరితో పోల్చితే... ప్రయాణికుల వాహనాల అమ్మకాల్లో 11.14 శాతం వృద్ధి నమోదు కాగా, ద్విచక్రవాహనాల అమ్మకాలు 6.63 శాతం మేర పుంజుకున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ఈ మేరకు వెల్లడించింది. దేశీయ విపణిలో 2021 జనవరిలో 2,76,554 ప్రయాణికుల వాహనాలు అమ్ముడు కాగా, 2020 జనవరిలో 2,48,840 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి.

అయితే, కరోనా పరిస్థితుల్లో ప్రయాణికుల వాహనాల ఉత్పత్తి మాత్రం కుంటుపడింది. 2021 జనవరిలో 2.26 శాతం తగ్గుదల చూపుతూ 3,03,834 ప్రయాణికుల వాహనాలు మాత్రమే తయారయ్యాయి. గతేడాది జనవరిలో ఉత్పత్తయిన వాహనాల సంఖ్య 3,10,864 అని సియామ్ వెల్లడించింది.

ఇక ద్విచక్రవాహనాల విషయానికొస్తే... 2021లో 14,29,928 వాహనాల విక్రయాలు జరిగాయి. గతేడాది జనవరిలో అమ్ముడైన ద్విచక్రవాహనాల సంఖ్య 13,41,005 మాత్రమే. ప్రయాణికుల వాహనాల ఉత్పత్తితో పోల్చితే ద్విచక్రవాహనాల ఉత్పత్తిలో వృద్ధి నమోదైంది. 12.55 మేర వృద్ధితో 2021 జనవరిలో 18,39,046 ద్విచక్రవాహనాలు ఉత్పత్తి కాగా, 2020 జనవరిలో 16,33,983 ద్విచక్రవాహనాలు ఉత్పత్తయ్యాయి.

More Telugu News