ముంబయిలో ప్రతిదీ సాఫీగా జరిగిపోతుంది: విజయ్ దేవరకొండ

11-02-2021 Thu 21:12
  • లైగర్ చిత్రంలో నటిస్తున్న విజయ్ దేవరకొండ
  • పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిత్రం
  • ముంబయిలో షూటింగ్
  • ముంబయిలో పనితీరు బాగుందన్న విజయ్
  • హైదరాబాదుతో పోల్చితే హడావిడి తక్కువ అని వెల్లడి 
Vijay Devarakonda opines about Mumbai working style

టాలీవుడ్ లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోల్లో ఒకరైన విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్. లైగర్ చిత్రాన్ని కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ లైగర్ షూటింగ్ కోసం హైదరాబాద్, ముంబయి మధ్య చక్కర్లు కొడుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ముంబయిలో షూటింగ్ ను తాను ఎంతో ఆస్వాదిస్తున్నానని, చాలా ప్రశాంత వాతావరణంలో చిత్రీకరణ జరుగుతోందని అన్నాడు. హైదరాబాద్ తో పోల్చితే ముంబయిలో పనితీరు ఎంతో సాఫీగా, ఎలాంటి హడవిడి లేకుండా జరిగిపోతుందని తెలిపాడు. హైదరాబాద్ లో అయితే అందరి దృష్టి తనపైనే ఉంటుందని, ముంబయిలో అలాంటి ఇబ్బంది లేదని వెల్లడించాడు.

"నా జీవనశైలిని ప్రభావితం చేసే ఏ అంశాన్నీ నేను ఆమోదించబోను. అయితే ముంబయిలో పనితీరు ఎంతో నచ్చింది. ప్రతిదీ అత్యంత సజావుగా సాగిపోతోంది. ఇక్కడి సిబ్బంది కూడా ఎంతో నైపుణ్యం ఉన్నవాళ్లు. హైదరాబాదులో ఉంటే పొగడ్తలూ, ప్రశంసలు వంటి అంశాలు మనల్ని మరో మార్గంలోకి మళ్లిస్తాయి. ముంబయిలో అలాంటి సమస్యలేదు. ఈ నగరం ఒక పట్టుగూడు వంటిది. పనిచేసుకుంటాం, హోటల్ కు వెళ్లిపోతాం. నన్ను కలిసేందుకు వచ్చే జనాలు ఇక్కడెవరూ ఉండరు. అందుకే ఇకపై ముంబయిని నా కార్యక్షేత్రంగా మార్చుకుందామని అనుకుంటున్నా. ముంబయిలో పనిచేసుకోవడం, ఇంటికి వెళ్లాలనిపిస్తే హైదరాబాద్ వెళ్లిపోవడం... ఈ దిశగా ఆలోచిస్తున్నా" అని వివరించారు.

ఇక లైగర్ ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందా? అని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని విజయ్ దేవరకొండ బదులిచ్చాడు. మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నదే తమ స్ట్రాటజీ అని స్పష్టం చేశాడు. ప్రతి చిత్రం తర్వాత ఇంతకంటే పెద్దది ఇంకేం చేయాలన్న ఆలోచన ఉత్పన్నమవుతుందని, అయితే మనకున్నది ఒకటే జీవితం కావడంతో చేసేది ఏదైనా గొప్పగా చేయాలని భావిస్తుంటానని వెల్లడించాడు. ఈ క్రమంలో తాను గతంలో చేసిన సినిమాల గురించి ఆలోచించనని, అర్జున్ రెడ్డి, గీతగోవిందం చిత్రాల గురించి ఇప్పుడు మాట్లాడడం తనకు నచ్చదని విజయ్ స్పష్టం చేశాడు. చేయబోయే చిత్రాల గురించే మాట్లాడడం తనకు ఇష్టమని తెలిపాడు.

తాను బాధ్యతగా వ్యవహరించేది ప్రేక్షకుల పట్లేనని, ఎందుకంటే వారు తనపై నమ్మకంతో థియేటర్లకు వస్తారని, వారికి వినోదం అందించడమే తన కర్తవ్యంగా భావిస్తానని వివరించాడు. "వాళ్లు ఎంతో కష్టపడిన సొమ్ముతో నా సినిమాను మొదటి రోజే చూడ్డానికి వస్తారు. క్యూల్లో గంటల కొద్దీ నిలుచుని టికెట్ల కోసం ఫైటింగులు చేసిన  వాడిని. ఆ బాధ నాకు తెలుసు. అందుకే వాళ్ల టికెట్ రేటుకు న్యాయం చేయడం నా బాధ్యతగా భావిస్తాను. వాళ్లు నాపై చూపుతున్న ప్రేమకు, నా కోసం వెచ్చిస్తున్న సమయానికి తగిన విలువ ఉండేలా చూడడం నా ప్రాధాన్యతా అంశం. వారికి నచ్చే అంశాలే నా చిత్రాల్లో ఉండేలా చూసుకుంటాను.. అంతే తప్ప ఫలానా చిత్రాలు చేయాలంటూ నన్ను ఎవరైనా కోరడం నాకు నచ్చదు. ఎలాంటి చిత్రాల్లో నటించాలో నాకు ఇతరులు చెబితే ఎలా?" అంటూ విజయ్ దేవరకొండ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.