ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో.. రాజమౌళి, మహేశ్ సినిమా!

11-02-2021 Thu 20:57
  • మహేశ్, రాజమౌళి కాంబోలో భారీ సినిమా 
  • కథను తయారుచేసిన విజయేంద్ర ప్రసాద్ 
  • ఆఫ్రికన్ అడవుల్లో సాగే అడ్వెంచరస్ మూవీ
  • వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్లానింగ్  
Mahesh movie with Rajamouli in forest back drop

ఈవేళ దర్శకుడిగా రాజమౌళి స్థాయి వేరు.. 'బాహుబలి' తర్వాత ఆయన స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఆయన నుంచి ఒక సినిమా వస్తోందంటే పరిశ్రమ అంతా ఒక్కసారిగా అటువైపు దృష్టి పెడుతోంది. ఈసారి మళ్లీ బాక్సాఫీసు వద్ద ఎటువంటి సంచలనం సృష్టించనున్నాడన్న కుతూహలం అందరిలోనూ పెరిగిపోతుంది.

అటువంటి దర్శకుడితో సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా అంటే ఇంక చెప్పేదేముంది? వీరిద్దరి కలయికలోనూ ఓ సినిమాను నిర్మించడానికి గత కొంత కాలంగా సన్నాహాలు జరుగుతున్నాయి. తమ కాంబినేషన్లో ఓ చిత్రం రానుందంటూ రాజమౌళి కూడా పబ్లిక్ గా ఇప్పటికే ప్రకటించాడు. ఇక అప్పటి నుంచీ ఈ సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందన్నది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ విషయంపై తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. మహేశ్-రాజమౌళి  సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుందనేదే ఆ వార్త!

మహేశ్ బాబు ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ కథను తయారుచేశారనీ, ఇది ఆఫ్రికన్ అడవుల్లో సాగే అడ్వెంచరస్ కథ అనీ తాజా సమాచారం. సౌతాఫ్రికాలోని దట్టమైన అడవుల్లో ఈ చిత్రం లోని ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందట. మొత్తానికి వెండితెరపై ఇదొక వండర్ అవుతుందని, అటువంటి పవర్ ఫుల్ అడ్వెంచరస్ కథను తయారుచేశారనీ సమాచారం. ఇది వచ్చే ఏడాది సెట్స్ కి వెళ్లే అవకాశం వుంది.