BCCI: చెన్నై టెస్టులో ఉపయోగించిన బంతి నాణ్యతపై భారత ఆటగాళ్ల ఫిర్యాదులు... దృష్టిసారించిన బీసీసీఐ

  • చెన్నై టెస్టులో బంతి ఆకారంపై ఆటగాళ్ల అసంతృప్తి
  • 60 ఓవర్లకే బంతి పాడైపోయిందన్న ఆటగాళ్లు
  • చెన్నై టెస్టులో ఎస్జీ కంపెనీ బంతుల వినియోగం
  • ఎస్జీ కంపెనీ దృష్టికి తీసుకెళ్లిన బీసీసీఐ
  • బంతుల నాణ్యతపై సమీక్షించుకుంటామన్న ఎస్జీ
BCCI asks SG Company to review ball quality after players complaints

ఇటీవల ఇంగ్లండ్ జట్టుతో చెన్నైలో జరిగిన టెస్టులో బంతి నాణ్యతపై భారత ఆటగాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఎస్జీ కంపెనీ తయారుచేసిన బంతులను ఈ టెస్టులో వినియోగించారు. అయితే, 60 ఓవర్లకు ఎస్జీ బంతి ఆకారం మారిపోతోందని, కుట్లు ఊడిపోతున్నాయని కోహ్లీ, అశ్విన్ ఫిర్యాదు చేశారు. బంతి సీమ్ చెడిపోవడం తానెప్పుడూ చూడలేదని అశ్విన్ పేర్కొనగా, టెస్టుల్లో ఇలాంటి బంతిని ఏ జట్టు కోరుకోదని కోహ్లీ అన్నాడు. దీనిపై బీసీసీఐ స్పందించింది.

టెస్టుల్లో ఉపయోగిస్తున్న బంతుల నాణ్యత పరిశీలించాలంటూ బోర్డు ఎస్జీ కంపెనీ వర్గాలకు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎస్జీ సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ పరాస్ ఆనంద్ నిర్ధారించారు. తమకు బీసీసీఐ నుంచి వచ్చిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని వెల్లడించారు. చెన్నై పిచ్ పైనా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పిచ్ ప్రభావం బంతిపై పడిందా? అనే కోణంలో కూడా సమీక్ష జరుపుతామని పరాస్ ఆనంద్ వివరించారు. బంతి నాణ్యత విషయంలో రాజీపడబోమని, తమ సాంకేతిక బృందం అవసరమైన మేరకు మార్పులు చేస్తుందని తెలిపారు.

More Telugu News