China: చైనా వెనక్కు తగ్గింది.. దశల వారీగా బలగాల ఉపసంహరణ: రక్షణ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​

  • తూర్పు లడఖ్ లో పరిస్థితిపై పార్లమెంట్ లో వివరణ
  • ఒక్క అంగుళం భూమీ చైనాకు వదిలేయలేదని స్పష్టీకరణ
  • సరిహద్దుల వద్ద శాంతికి కట్టుబడి ఉన్నామని వెల్లడి
  • ఫింగర్ 8 బేస్ కు చైనా.. ఫింగర్ 3 బేస్ కు భారత బలగాలు
Agreement on disengagement along Pangong Lake after talks with China says Defence minister Rajnath Singh

తూర్పు లడఖ్ లోని పాంగోంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల్లో సైన్యాన్ని వెనక్కు తీసుకునేందుకు చైనా అంగీకరించిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. బలగాల ఉపసంహరణపై చైనాతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయన్నారు. తూర్పు లడఖ్ లోని పరిస్థితులపై పార్లమెంట్ లో ఆయన గురువారం మాట్లాడారు. వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణకు సంబంధించి అన్ని వివరాలను వెల్లడించారు.

పరస్పర సమన్వయంతో దశల వారీగా బలగాల ఉపసంహరణ ఉంటుందన్నారు. ‘‘ఫింగర్ 2, ఫింగర్ 3 మధ్య ఉన్న ధన్ సింగ్ థాపా పోస్ట్ కు మన సైనికులు తిరిగి వచ్చేస్తారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికులు ఫింగర్ 8 తూర్పు ప్రాంతానికి వెళతారు. ప్రస్తుతం ఘర్షణ జరిగిన ప్రాంతాన్ని ‘నో పెట్రోలింగ్ జోన్’గా గుర్తిస్తారు’’ అని ఆయన చెప్పారు.  

పాంగోంగ్ ఉత్తర దిక్కునున్న ఫింగర్ 8 తూర్పు ప్రాంతం చైనాకు, ఫింగర్ 3 పోస్ట్ భారత్ కు శాశ్వత బేస్ లుగా ఉంటాయన్నారు. పాంగోంగ్ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత 48 గంటల్లో రెండు దేశాల కమాండర్ స్థాయి సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు.

ఇండియా కోల్పోయిందేమీ లేదు

బలగాల ఉపసంహరణలో భారత్ కోల్పోయిందేమీ లేదని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఒక్క అంగుళం భూమినీ వదులుకోలేదన్నారు. అయినా, చైనాతో మరికొన్ని సమస్యలు అలాగే ఉండిపోయాయన్నారు. సైన్యం మోహరింపు, వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పెట్రోలింగ్ వంటి విషయాలపై తదుపరి చర్చల్లో ప్రస్తావిస్తామన్నారు.

తూర్పు లడఖ్ లోని ఎల్ఏసీ వెంట ఘర్షణ వాతావరణం భారీగా పెరిగిందన్నారు. చైనా ఇప్పటికే అక్కడికి భారీగా ఆయుధాలు, బలగాలు, మందుగుండు సామగ్రిని తరలించిందని చెప్పారు. దానికి దీటుగా భారత్ కూడా బలగాలను మోహరించిందని గుర్తు చేశారు.

అయితే, సరిహద్దుల వద్ద శాంతిని నెలకొల్పేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. అదే సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమంటూ మన సైనికులు తెగువ చూపించారని కొనియాడారు.

చైనాతో చర్చల్లో భాగంగా మూడు ప్రధాన నియమాలను భారత్ పాటించిందని రాజ్ నాథ్ చెప్పారు. అవి.. ఇరువైపులా ఎల్ఏసీని గౌరవించడం, ఏకపక్షంగా ఎవరూ స్టేటస్ కోను ఉల్లంఘించకపోవడం, ద్వైపాక్షిక ఒప్పందాల్లో కుదుర్చుకున్న ప్రతి విషయాన్ని పాటించడం వంటి విషయాల్లో కరాఖండిగా ఉన్నామన్నారు.

More Telugu News