Andhra Pradesh: కెప్టెన్​ ఒక్కడితోనే విజయం సాధ్యం కాదు: ఏపీ సీఎం జగన్​

  • ఆటగాళ్లంతా తలో చెయ్యి వెయ్యాలి
  • పాలన ఇప్పుడు మధ్య ఓవర్లలోకి వచ్చింది
  • ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటే వెనకబడుతాం
  • ఉగాది నుంచి వలంటీర్లకు సత్కారాలు చేయండి
  • వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశంలో సీఎం
We enter middle overs of the administration never relax says AP CM Jagan

పాలనను క్రికెట్ తో పోల్చారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆటలో ఒక్క కెప్టెన్ ఆడినంత మాత్రాన విజయం వరించదని, ఆటగాళ్లందరూ తలో చెయ్యి వేస్తేనే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన పాలనలో మూడో వంతు సమయం పూర్తయిందన్నారు. మధ్య ఓవర్లలోకి ప్రవేశించిన ఈ సమయంలో విశ్రాంతి తీసుకుంటే మళ్లీ వెనకబడిపోతామన్నారు. సచివాలయంలో ఆయన వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు.

ఇప్పటివరకు చేసిన దాంట్లో ఏవైనా మార్పులు అవసరమా అన్న విషయంపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రజలకు మంచి చేసే పనులకు సహకరించాలని కోరారు. అధికారులంతా తన అంచనాలకు మించి పనిచేశారని, వారిని చూసి ప్రజలు గర్వపడుతున్నారని కొనియాడారు.

20 నెలల పాలనలోనే అన్నింటినీ అమలు చేసి చూపించామని జగన్ చెప్పారు. ఫలానా శాఖలో ఫలానా మార్పులు చేస్తే బాగుంటుందని అనిపిస్తే.. ఏ శాఖ అధికారి అయినా నిర్భయంగా అభిప్రాయాలు చెప్పొచ్చని ఆయన సూచించారు. వాటిని ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందన్నారు. ఉగాది నుంచి ప్రతి నియోజకవర్గంలోని వలంటీర్లను సన్మానించాలని సీఎం సూచించారు. సేవా రత్న, సేవా మిత్ర లాంటి బిరుదులను ఇవ్వాలన్నారు. ఒక్కోరోజు ఒక్కో నియోజకవర్గంలో ఈ సన్మాన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమాల్లో జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు పాల్గొనాలని ఆదేశించారు.

సచివాలయ వ్యవస్థను సొంతం చేసుకుంటేనే గ్రామాల్లోని సమస్యలు పరిష్కారమవుతాయని సీఎం జగన్ చెప్పారు. గతంలో ఎన్నికల కోసం వందల పేజీల మేనిఫెస్టోలు తయారు చేసిన పార్టీలు.. ఆ తర్వాత వాటిని చెత్తబుట్టలో వేశాయని, కానీ, తాము కేవలం రెండు పేజీల్లో అన్ని హామీలకు సంబంధించిన మేనిఫెస్టోను తయారు చేశామని చెప్పారు. అందులో 95 శాతం వరకు అమలు చేశామన్నారు.

More Telugu News