దుబాయ్ నుంచి గోవాకి రానున్న మహేశ్!

11-02-2021 Thu 09:35
  • మహేశ్ తాజా సినిమా 'సర్కారు వారి పాట' 
  • గత కొన్నాళ్లుగా దుబాయ్ లో షూటింగ్
  • తదుపరి షెడ్యూలుకి గోవాలో ఏర్పాట్లు
  • వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల   
Maheshbabu shoot in Goa

మహేశ్ బాబు ప్రస్తుతం దుబాయ్ లో వున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తను 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తొలి షెడ్యూలు షూటింగ్ గత నెల రోజులకు పైగా దుబాయ్ లోని వివిధ లొకేషన్లలో జరుగుతోంది. హీరో హీరోయిన్లు మహేశ్, కీర్తి సురేశ్ లతో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్న కీలక సన్నివేశాలను, కొన్ని యాక్షన్ దృశ్యాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఈ దుబాయ్ షెడ్యూలు పూర్తికానుంది.

ఆ తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని.. తదుపరి షెడ్యూలు షూటింగును నిర్వహించడానికి అప్పుడే ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఆ షెడ్యూలును గోవాలో నిర్వహించనున్నట్టు తాజా సమాచారం. అక్కడ కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకుంటున్న కుంభకోణాల కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు.