Hyderabad: హైదరాబాద్‌లో శివారులో దారుణం.. ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్యాయత్నం!

Pharmacy Student Kidnapped and Attacked in Hyderabad
  • కాలేజీ వద్ద ఆటో ఎక్కిన విద్యార్థిని
  • స్టేజి వద్ద ఆపకుండా యంనంపేట తీసుకెళ్లిన దుండగులు
  • అక్కడ సిద్ధంగా ఉన్న వ్యాన్‌లోకి బలవంతంగా ఎక్కించిన నిందితులు
  • పోలీసుల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్ శివారులోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఆటో ఎక్కిన ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో యువతి ప్రాణాలతో బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం..  నిన్న కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరిన విద్యార్థిని (19) సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో కళాశాల వద్ద ఆటో ఎక్కింది.

కొంతదూరం ప్రయాణించిన తర్వాత ఆటోలో అప్పటికే ఉన్న వృద్ధురాలు, పాప దిగిపోయారు.  ఆ తర్వాత కాస్త ముందుకు వెళ్లగానే ఇద్దరు యువకులు ఆటో ఎక్కారు. ఇంతలో విద్యార్థిని దిగాల్సిన ఆర్ఎల్ఆర్ నగర్ స్టేజీ వచ్చినా ఆటోను ఆపలేదు. ఆమె అరిచేలోగానే ఆటోలో అప్పటికే ఎక్కి కూర్చున్న ఇద్దరు యువకులు ఆమె నోరు నొక్కి పట్టుకున్నారు.

ఆటో ఘట్‌కేసర్ మండలంలోని యంనంపేట రాగానే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వ్యాన్‌లోకి ఆమెను ఎక్కించారు. యువతి చాకచక్యంగా తన వద్దనున్న ఫోన్‌తో కిడ్నాప్‌కు గురైనట్టు తల్లికి సమాచారం అందించింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్సల్ ఆధారంగా యంనంపేట చేరుకున్నారు.

యువతి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసిన విషయం తెలుసుకున్న వ్యాన్, ఆటో డ్రైవర్లతోపాటు ఆటోలో ఎక్కిన ఇద్దరు యువకులు యువతిని వ్యాన్ నుంచి దించి సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి కర్రలతో దాడి చేశారు. అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఆమెను వదిలి దుండగులు పరారయ్యారు. గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Hyderabad
Keesara
Crime News
Pharmacy Student
Kidnap

More Telugu News