Chandrababu: షర్మిల పార్టీపై జగన్ స్పందించాలి.. సొంత వాళ్లకు కూడా వెన్నుపోటు పొడిచాడు: చంద్రబాబు

Chandrababu demands Jagan to respond on Sharmila party
  • షర్మిల పార్టీ పెడితే విజయసాయి లేదంటున్నారు
  • జగన్ తో ఆరోజు వివేకా కూతురు, ఈరోజు షర్మిల పోరాడుతున్నారు
  • వైసీపీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు
రాజకీయ పార్టీని పెడుతున్నానంటూ వైయస్ షర్మిల చెప్పినప్పటికీ... ఏ2 విజయసాయిరెడ్డి మాత్రం అదేమీ లేదంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయసాయికి సంబంధించిన ఓ వీడియోను ప్లే చేశారు.

ఆనాడు జగనన్న వదిలిన బాణం విశ్వసనీయత ఈనాడు ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. షర్మిల పార్టీ పెట్టడంపై జగన్ స్పందించాలని అన్నారు. ఇంట్లో వాళ్లకి కూడా జగన్ వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇంకా తేలనే లేదని అన్నారు. వివేకా కేసులో సీబీఐ విచారణ కావాలని అప్పుడు డిమాండ్ చేసిన జగన్... ఇప్పుడు వద్దంటున్నారని విమర్శించారు. జగన్ తో ఆరోజు వివేకా కూతురు, ఈరోజు షర్మిల పోరాడుతున్నారని అన్నారు.

వైసీపీ పతనం ప్రారంభమైందని... పంచాయతీ ఎన్నికలే దీనికి నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 20 నెలల పాలనలో వైసీపీవి అన్నీ ఉల్లంఘనలేనని... రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీసే స్థాయికి వచ్చేశారని మండిపడ్డారు. ఎన్ని దుర్మార్గాలకు, బెదిరింపులకు పాల్పడినా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి  బుద్ధి చెప్పారని అన్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 38.74 శాతం ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వస్తే... 94 శాతం గెలుచుకున్నామంటూ వైసీపీ నేతలు గాలి కబుర్లు చెపుతున్నారని చెప్పారు. ఈ ఫలితాలను చూసైనా వైసీపీ నేతలు అరాచకాలను ఆపాలని అన్నారు.

ఎస్ఈసీ చెపితే వినొద్దని మంత్రి పెద్దిరెడ్డి చెబుతారా? అని చంద్రబాబు మండిపడ్డారు. ఈ మంత్రి ఏమైనా పెద్ద పోటుగాడా? అని ఎద్దేవా చేశారు. ఐఏఎస్, ఐసీఎస్ అధికారులను కూడా బెదిరిస్తాడా? అని మండిపడ్డారు. మంత్రులు  పెద్దిరెడ్డి, బాలినేని పంచాయతీ ఎన్నికలను రణరంగంగా మార్చారని చెప్పారు. పలు చోట్ల ఫలితాలను తారుమారు చేశారని దుయ్యబట్టారు. పోలీసులు  కూడా పలు చోట్ల ఏక పక్షంగా పని చేశారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 174 అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.
Chandrababu
Telugudesam
YS Sharmila
Jagan
YSRCP
Vijayasai Reddy

More Telugu News