Petrol: సీతమ్మ పుట్టిన నేపాల్​, రావణ లంకలో పెట్రోల్​ రేట్లు తక్కువే.. మరి, రాముడి గడ్డపై ఎప్పుడు తగ్గిస్తారు?: పార్లమెంటులో ఎంపీ ప్రశ్న

  • రామాయణ పాత్రలతో సోషల్ మీడియా పోస్టులను ప్రస్తావించిన సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు
  • కౌంటర్ ఇచ్చిన పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
  • బంగ్లాదేశ్, నేపాల్ లో కిరోసిన్ ధర రూ.59 ఉందన్న మంత్రి
  • వినియోగాన్ని బట్టి ధర పెరుగుతుందని వెల్లడి
  • ఆయా దేశాల్లో పెట్రోల్ వాడకం తక్కువని వ్యాఖ్య
Why Fuel is Cheaper In Sitas Nepal Ravanas Lanka asks Rajyasabha MP

దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు సెంచరీ దిశగా దూసుకుపోతున్నాయి. ప్రజలూ దానిపై గుర్రుగానే ఉన్నారు. ఇక, ప్రతిపక్షాల గురించి చెప్పేదేముంటుంది! అవకాశం దొరకాలేగానీ, ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడేసుకోరూ. అలాంటి చాన్సే ఇప్పుడు వారికి దొరికింది. ప్రభుత్వాన్ని ఎలా ఇరకాటంలో పెట్టాలో అలా పెట్టేస్తున్నారు. తాజాగా సమాజ్ వాదీ పార్టీ ఎంపీ విశంభర్ ప్రసాద్ నిషద్ రాజ్యసభలో అలాంటి ప్రశ్నే వేశారు.

‘‘సీతమ్మ తల్లి పుట్టిన నేపాల్ లోనూ, రావణుడి లంకలోనూ పెట్రోల్ రేట్లు తక్కువగానే ఉన్నాయి. మరి, రాముడి గడ్డ అయిన మన దగ్గర కేంద్ర ప్రభుత్వం రేట్లను ఎప్పుడు తగ్గిస్తుంది?’’ అని ప్రశ్నించారు. రామాయణంలోని పాత్రలను పోలుస్తూ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోందంటూ ఆయన రాజ్యసభలో పెట్రోల్ ధరల విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ఆ దేశాలతో భారత్ ను పోల్చడం సరికాదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జవాబిచ్చారు.

ఆయా దేశాల్లో చాలా తక్కువ మంది మాత్రమే పెట్రోల్ వాడుతారని, మన దగ్గర అలాంటి పరిస్థితుల్లేవని చెప్పారు. వినియోగం ఎంత పెరిగితే ధరలు అంత ఎక్కువగా ఉంటాయన్నారు. మన దేశాన్ని పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలుస్తామా? చిన్న ఆర్థిక వ్యవస్థలతోనా? అని ఎదురు ప్రశ్న వేశారు. బంగ్లాదేశ్, నేపాల్ లలో కిరోసిన్ ధర రూ.57 నుంచి రూ.59 దాకా ఉందని, మరి, మన దేశంలో లీటర్ కిరోసిన్ ధర కేవలం రూ.32గా ఉందని చెబుతూ మంత్రి కౌంటర్ ఇచ్చారు. 

More Telugu News