AP High Court: మిషన్ బిల్డ్ ఏపీ కేసు.. ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

  • మిషన్ బిల్డ్ ఏపీ కేసులో ప్రవీణ్ కుమార్ పై క్రిమినల్ కేసులకు ఆదేశించిన హైకోర్టు
  • హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం
Supreme Court stays  HC orders in Mission Build AP case

మిషన్ బిల్డ్ ఏపీ అంశానికి సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే, తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టాలని కోరింది. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.

హైకోర్టు జస్టిస్ రాకేశ్ కుమార్ డిసెంబర్ 30న తీర్పును వెలువరించి, డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. తన తీర్పులో ముఖ్యమంత్రి జగన్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పై ఉన్న కేసుల వివరాలను తీర్పులో పొందుపరిచారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ రాసిన తర్వాత... రాష్ట్రంలోని అధికారులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈ తీర్పు ఇరు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించింది.

More Telugu News