Madhya Pradesh: ప్రపంచంలోనే అత్యంత పురాతన జీవి శిలాజం.. మధ్యప్రదేశ్​ లో గుర్తింపు!

  • భీమ్ బేత్కా రాతి గుట్టల్లో 57 కోట్ల ఏళ్లనాటి డికిన్ సోనియా శిలాజం
  • అనుకోకుండా కనిపెట్టిన శాస్త్రవేత్తలు
  • అడుగున్నర పొడవుందని వెల్లడి
  • 55 కోట్ల ఏళ్ల క్రితం గోండ్వానా ఏర్పడిందనడానికి నిదర్శనమని వ్యాఖ్య
Discovered in Bhimbetka Indias lone fossil of worlds oldest animal

ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన ప్రాంతమది. ఎన్నో దశాబ్దాల పాటు ఎందరెందరో శాస్త్రవేత్తలు, పరిశోధకులు అక్కడ పరిశోధనలు చేశారు. కొత్త కొత్త విషయాలను కనిపెట్టారు. కానీ, ప్రపంచంలోనే అత్యంత పురాతన శిలాజం ఉందన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. ఇప్పుడు అనుకోకుండా దానిని గుర్తించారు. ముందుగా ఆకులాంటి ఓ బొమ్మ అని భ్రమపడినా.. తర్వాత 57 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై తిరుగాడిన ‘అతి పురాతన జీవి’ డికిన్సోనియాగా నిగ్గు తేల్చారు.

మధ్యప్రదేశ్ లోని భీమ్ బేత్కాలో ఉన్న రాతి గుట్టలపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)కు చెందిన ఇద్దరు నిపుణులు ఈ డికిన్సోనియా శిలాజాన్ని గుర్తించారు. గత ఏడాది మార్చిలో 36వ అంతర్జాతీయ భౌగోళిక సదస్సు సందర్భంగా ఆ ఇద్దరు పరిశోధకులు భీమ్ బేత్కా గుట్టల దగ్గరకు వెళ్లారు. అప్పుడే దాని ఆనవాళ్లను గుర్తించి పరిశోధన చేశారు. మామూలుగా ఎడియాకారా జాతికి చెందిన ఈ డికిన్సోనియాలు నాలుగు అడుగుల దాకా పెరుగుతాయట. కానీ, మన శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ శిలాజం పొడవు కేవలం 17 అంగుళాలే ఉందట. అంటే దాదాపు అడుగున్నర అంతే.

దీనికి సంబంధించిన అధ్యయనం మొత్తం గోండ్వానా రీసెర్చ్ అనే సైట్ లో ప్రచురితమైంది. దాని ప్రకారం సుమారు 55 కోట్ల ఏళ్ల క్రితం గోండ్వానా ఏర్పడిందనడానికి ఈ శిలాజమే సాక్ష్యమంటూ పరిశోధకులు పేర్కొన్నారు. దీనితో జీవ భౌగోళిక ప్రావిన్సులు, భూమిలోపలి టెక్టానిక్ ప్లేట్ల అరమరికలను తెలుసుకోవడానికి వీలు చిక్కుతుందని చెబుతున్నారు. వాస్తవానికి 64 ఏళ్ల క్రితమే భీమ్ బేత్కాలోని ఈ రాతి గుట్టలను వీఎస్ వకాంకర్ అనే పురాతత్వ శాస్త్రవేత్త కనుగొన్నారు. అయితే, శిలాజాన్ని మాత్రం గుర్తించలేకపోయారు.

ఇక, భీమ్ బేత్కాను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించడానికి ముందు 20 ఏళ్ల క్రితం జీఎస్ఐ కూడా వింధ్య పర్వతాల్లో చాలా పరిశోధనలు చేసింది. ముందుగా 400 రాతి గుట్టలనే గుర్తించినా.. పరిశోధన పూర్తయ్యే నాటికి అవి వెయ్యికి పెరిగాయని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్బీ ఓటా అన్నారు. యునెస్కో ప్రకారం భీమ్ బేత్కాలోని రాతికళ మధ్య రాతియుగం నాటిది.

More Telugu News