Congress: వైయస్ షర్మిల తప్పు చేస్తున్నారు: జగ్గారెడ్డి

YS Sharmila is making mistake says Jagga Reddy
  • వైయస్ పేరు నిలబెట్టాలనుకుంటే కాంగ్రెస్ తో కలిసి పని చేయాలి
  • కాంగ్రెస్ ను దెబ్బతీయడానికే షర్మిల పార్టీ
  • కేసీఆర్, జగన్, పవన్ కల్యాణ్, షర్మిల వీరందరూ అమిత్ షా బాణాలే
దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. తన పార్టీకి ఆమె వైయస్సార్టీపీ అనే పేరు పెడుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తమ లక్ష్యమని ఆమె నిన్న ప్రకటించారు. తన సోదరుడు జగన్ తో తనకు సంబంధం లేదని... ఆయన దారి ఆయనదే, తన దారి తనదే అని చెప్పారు.

మరోవైపు, షర్మిల పార్టీపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ సంగతి పక్కన పెడితే... తెలంగాణలో మాత్రం ఆమెకు రాజకీయ విమర్శలు ఎదురవుతున్నాయి. షర్మిల ఇప్పుడు కేసీఆర్ వదిలిన బాణం అని నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ, కొత్త పార్టీ పెట్టి షర్మిల తప్పు చేస్తున్నారని అన్నారు.

తన తండ్రి వైయస్ పేరును నిలబెట్టాలనుకుంటే కాంగ్రెస్ తో కలిసి పనిచేయవచ్చని చెప్పారు. కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి షర్మిల పనిచేస్తున్నారని విమర్శించారు. షర్మిల పార్టీపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ అంటే పొలిటికల్ టూరిస్ట్ స్పాటా? అని మండిపడ్డారు. కేసీఆర్, జగన్, పవన్ కల్యాణ్, షర్మిల వీరందరూ అమిత్ షా వదిలిన బాణాలు అని అన్నారు.
Congress
Jagga Reddy
YS Sharmila
Jagan
YSRCP
Amit Shah
KCR
TRS
BJP

More Telugu News