Punjab: మైనర్ అయినా రజస్వల అయితే చాలు.. ముస్లిం అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు: హర్యానా హైకోర్టు తీర్పు

  • ఇస్లాం చట్టాలు అవే చెపుతున్నాయంటూ అందులోని అంశాల ప్రస్తావన
  •  వాటి ప్రకారం మేజర్ కాకుండా పెళ్లి చేసుకున్నా తప్పు కాదని వ్యాఖ్య
  • మతిస్థిమితం సరిగా లేని వారు, రజస్వల కాని మైనర్లూ సంరక్షకుల సమక్షంలో పెళ్లి చేసుకోవచ్చని తీర్పు
Muslim law allows minor girls to marry on attaining puberty Haryana High Court

పెళ్లీడు మామూలుగా అయితే అబ్బాయిలకు 21 ఏళ్లు, అమ్మాయిలకు 18 ఏళ్లుగా నిర్ణయించాయి మన చట్టాలు. వాటి ప్రకారం మైనర్లకు పెళ్లి చేయడం పెద్ద నేరం. బాల్య వివాహాల కింద పరిగణిస్తుంటారు. అయితే, ముస్లిం అమ్మాయిలు మాత్రం వయసుతో సంబంధం లేకుండా.. రజస్వల అయితే చాలు పెళ్లి చేసుకోవచ్చట. పంజాబ్–హర్యానా హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. దీనికి ముస్లిం నిఖాలపై ఉన్న సాహిత్యం, ఇటీవలి కోర్టు తీర్పులను ఆధారంగా చూపిస్తోంది. ఇస్లాం చట్టం, సంప్రదాయం ప్రకారం అమ్మాయి మేజర్ కాకుండా పెళ్లి చేసినా తప్పు కాదని పేర్కొంది.

అందుకు సర్ దిన్షా ఫర్దూన్జీ ముల్లా రాసిన ‘మహ్మదీయ చట్ట నియమాలు’ అనే పుస్తకంలో పేర్కొన్న ముస్లిం పర్సనల్ లాలోని 195వ అధికరణాన్ని కోర్టు గుర్తు చేసింది. వయసుతో సంబంధం లేకుండా అమ్మాయి రజస్వల అయిన వెంటనే తాను కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చంటూ ఆ నియమాలు చెబుతున్నాయని పేర్కొంది. ‘‘ముస్లిం చట్టాల ప్రకారం మతిస్థిమితం సరిగ్గా లేని వారు, రజస్వల కాని మైనర్లకు.. పెద్దలు, వారి సంరక్షకులు పెళ్లి చేయవచ్చు’’ అని పంజాబ్ కు చెందిన ముస్లిం దంపతులు వేసిన పిటిషన్ పై విచారించిన హర్యానా హైకోర్టు జడ్జి జసట్ఇస్ అల్కా సరీన్ ఈ తీర్పునిచ్చారు.

ఈ కేసులో 36 ఏళ్ల వ్యక్తి, 17 ఏళ్ల అమ్మాయి ఈ ఏడాది జనవరి 21న ముస్లిం సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అయితే, ఆ పెళ్లి అమ్మాయి తల్లిదండ్రులకు, వారి తరఫు బంధువులకు ఇష్టం లేదు. దీంతో తమకు రక్షణ కల్పించాల్సిందిగా ఆ జంట కోర్టును ఆశ్రయించింది. తమ బంధువుల నుంచి రక్షించాలని కోరింది. ఈ నేపథ్యంలో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది.

More Telugu News