India: రోజుకు 12 గంటల చొప్పున వారంలో నాలుగు రోజుల పని: కసరత్తు చేస్తున్న కేంద్రం!

  • నాలుగు రోజుల పనిదినాలపై విధివిధానాలు
  • ఇప్పటికే అమలు చేసి ప్రొడక్టివిటీని పెంచిన మైక్రోసాఫ్ట్
  • విద్యుత్ బిల్లు ఆదా అవుతుందన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్
  • యాజమాన్యం, ఉద్యోగులు చర్చించి నిర్ణయం తీసుకోవచ్చన్న కేంద్రం
  • బలవంతం ఏమీ ఉండబోదన్న కార్మిక శాఖ
India Working on New Labour Code that 4 Days a Week Work

రోజుకు 12 గంటల చొప్పున నాలుగు రోజుల పాటు పని చేసి, ఆపై మూడు రోజుల విశ్రాంతి తీసుకునేలా కొత్త కార్మిక కోడ్ పై కేంద్రం కసరత్తు చేస్తోంది. అయితే, ఇదేమీ తప్పనిసరి కాదని, ఉద్యోగుల అనుమతితో అమలు చేసుకునే అవకాశాన్ని కల్పించుకోవచ్చని పేర్కొంటూ ముసాయిదాను సిద్ధం చేసింది. నాలుగు రోజుల పని అన్నంత మాత్రాన పని గంటలు ఏ మాత్రమూ తగ్గబోవు. చేసిన నాలుగు రోజులు ఊపిరి తీసుకోకుండా పని చేయాల్సి వుంటుంది. వారంలో ఆరు రోజుల పని దినాల్లో రోజుకు 8 గంటల పని ఉండగా, నాలుగు రోజుల పనిదినాల్లోనూ 48 గంటల పాటు పని చేయాల్సిందే.

తాజా ప్రతిపాదనలపై మరింత వివరణ ఇచ్చిన కార్మిక ఉపాధి శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నిబంధనల మేరకు వారంలో 48 గంటల పని తప్పనిసరని, ఒకవేళ కంపెనీలు వారంలో మూడు రోజుల పాటు సెలవులు ఇచ్చేందుకు నిర్ణయిస్తే, మిగతా రోజుల్లో 12 గంటల పని తప్పనిసరని, అయితే, ఈ విషయంలో ఉద్యోగులు, యాజమాన్యాలు చర్చించి ఓ నిర్ణయం తీసుకోవచ్చని, బలవంతం ఏమీ ఉండదని అన్నారు. కాలం మారుతోందని, అందుకు అనుగుణంగా పనితీరు సంస్కృతిని మార్చాలన్న ఆలోచనతోనే ఈ ప్రతిపాదనలు చేశామని స్పష్టం చేశారు.

కాగా, ఇప్పటికే సాఫ్ట్ వేర్ సంస్థలు వారాంతంలో రెండు రోజుల సెలవులను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కొత్త కార్మికుల కోడ్ అమలులోకి వస్తే, ఉద్యోగులతో చర్చించి, నాలుగు రోజుల పని దినాలను యాజమాన్యాలు అమలు చేయవచ్చు. ఈ విషయంలో మైక్రోసాఫ్ట్ సంస్థ జపాన్ లో 2019లోనే నిర్ణయం తీసుకుందన్న సంగతి గుర్తుండే ఉంటుంది. నాలుగు రోజుల విధానాన్ని తెచ్చిన తరువాత తమ ప్రొడక్టివిటీ 40 శాతం పెరిగిందని సంస్థ గతేడాది స్పష్టం చేసింది.

మూడు రోజులు కుటుంబంతో గడపడం వల్ల మిగతా నాలుగు రోజులూ మరింత ఉత్సాహంతో ఉద్యోగులు పని చేశారని, మూడు రోజుల సెలవు వల్ల కంపెనీలకు విద్యుత్ ఖర్చులు కలిసొచ్చాయని, ఉద్యోగులకూ డబ్బు ఆదా అయిందని పేర్కొంది. నాలుగు రోజుల పని దినాలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఇటీవల ఓ రిపోర్టును విడుదల చేస్తూ, విద్యుత్ ఖర్చులు కలిసొచ్చి, టర్నోవర్ లో 2 శాతానికి పైగా మిగులుతుందని అంచనా వేసింది.

జర్మనీ లోని అతిపెద్ద ట్రేడ్ యూనియన్ గా గుర్తింపు పొందిన ఐజీ మెటాల్ సైతం నాలుగు రోజుల పనిదినాలు కావాలని కోరింది. ఇదే సమయంలో నాలుగు రోజుల పనితో వినియోగదారుల అంచనాలకు తగ్గట్టుగా పని జరిగే అవకాశాలు లేవని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా వుంది. ఏది ఏమైనా ఇండియాలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుని, అమల్లోకి రావడానికి మరికొన్నేళ్ల సమయం పట్టవచ్చు.

More Telugu News