Sajjala Ramakrishna Reddy: తెలంగాణలో పార్టీ వద్దని జగన్ సూచించారు... మరో పార్టీ ప్రారంభించాలన్నది షర్మిల ఆలోచనగా కనిపిస్తోంది: సజ్జల

  • అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాల్లేవన్న సజ్జల
  • భిన్నాభిప్రాయాలే తప్ప, విభేదాలు లేవని వ్యాఖ్యలు
  • తాను ఏపీకే జవాబుదారీ అని జగన్ భావిస్తున్నారన్న సజ్జల
  • షర్మిలది సొంత నిర్ణయం అని వివరణ
Sajjala Ramakrishna Reddy opines on Sharmila new political party

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల నూతన పార్టీ స్థాపించబోతోందన్న విషయం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇవాళ హైదరాబాదులోని లోటస్ పాండ్ లో అభిమానులు, సన్నిహితులతో షర్మిల జరిపిన సమావేశం పార్టీ ప్రారంభానికి సన్నాహకంగా భావిస్తున్నారు. దీనిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

తెలంగాణలో పార్టీ ఎందుకు ఉండకూడదన్న అంశంపై గత మూడు నెలలుగా వైఎస్ కుటుంబంలో చర్చ జరుగుతోందని వెల్లడించారు. ఏపీకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణలో పార్టీ వద్దని జగన్ సూచించారని, అయితే తెలంగాణలో మరో పార్టీ స్థాపించాలన్నది షర్మిల ఆలోచనగా కనిపిస్తోందని సజ్జల అభిప్రాయపడ్డారు. జగన్, షర్మిల మధ్య ఉన్నది భిన్నాభిప్రాయాలేనని తెలిపారు. అంతేతప్ప అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు లేవని స్పష్టం చేశారు.

తెలంగాణలో తమ పార్టీ వద్దని సీఎం జగన్ దృఢ నిర్ణయంతో ఉన్నారని, తండ్రి వైఎస్సార్ స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన జగన్ తాను ఏపీకి మాత్రమే జవాబుదారీ అని భావిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో, పార్టీ ప్రారంభించాలన్నది షర్మిల సొంత నిర్ణయం అని వివరణ ఇచ్చారు.

More Telugu News