Blink Charging Co: ఆదాయమే లేదు.. అయినా ఆ సంస్థ షేరు విలువ 3,000% పెరిగింది!

Company With Almost No Revenue Posts 3000 percent Gain In 8 Months Beats Tesla
  • విద్యుత్ వాహనాలకు చార్జింగ్ సంస్థ ‘బ్లింక్ చార్జింగ్ కో’పై మదుపరుల ఆసక్తి
  • 481కి ఎగబాకిన అమ్మకాల నిష్పత్తి
  • విద్యుత్ వాహనాల రారాజు టెస్లాను మించి నమోదు
  • 8 నెలల కాలంలోనే భారీగా పెరిగిన విలువ
ఆదాయం పెద్దగా లేనేలేదు. 11 ఏళ్లుగా లాభాలను చూపించిందీ లేదు. పైగా ఒకానొక దశలో దివాళా ప్రక్రియకు దగ్గరైంది. అలాంటి ఓ సంస్థ షేర్ల విలువ పెరగడం ఎప్పుడూ విని ఉండరు. కానీ, అమెరికాలో అలాంటి ఓ సంస్థకు మంచి డిమాండ్ ఉంది. బ్లింక్ చార్జింగ్ కో అనే సంస్థ షేర్లు అక్కడ హాట్ కేకులు. ఎంతలా అంటే.. 8 నెలల్లోనే ఆ సంస్థ షేరు విలువ 3,000 శాతం పెరిగింది మరి. అందులో అంతలా ఏముందంటే...

బ్లింక్ చార్జింగ్ కో.. విద్యుత్ వాహనాలకు చార్జింగ్ పెట్టుకునేలా నగరాల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన సంస్థ. దాని షేరు విలువ అంతలా పెరిగిపోవడానికి కారణం అదే. పర్యావరణ హిత ఇంధన సంస్థలకు అక్కడ మంచి మార్కెట్ ఉంది. అదే బ్లింక్ కు కలిసి వచ్చింది. మదుపరులు దానిపై మక్కువ పెంచుకునేలా చేసింది.

మార్కెట్ లోని 2,700 స్టాక్ లలో.. ఈ 8 నెలల కాలంలో ఏడు కంపెనీలే వంద కోట్ల డాలర్లకుపైగా నిధులను సమీకరించాయి. అందులో బ్లింక్ కూడా ఒకటంటేనే దానికి ఎంతలా ఆదరణ లభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. మార్కెట్ లో 217 కోట్ల డాలర్ల విలువున్న కంపెనీ అమ్మకాల నిష్పత్తి 481కి పెరిగింది. అదే విద్యుత్ కార్లకు పెట్టింది పేరైన టెస్లా అమ్మకాల నిష్పత్తి కేవలం 26.

వాస్తవానికి విద్యుత్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు అనేది చాలా చిన్నదని, ఇప్పటికైతే అది ప్రారంభ దశలోనే ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం పరిశ్రమ ఆదాయం చాలా తక్కువని రేమండ్ జేమ్స్ అండ్ అసోసియేట్ కు చెందిన విశ్లేషకుడు పావెల్ మొల్కనోవ్ అన్నారు. అందులో బ్లింక్ గత ఏడాది ఆదాయం కూడా కేవలం 55 లక్షల డాలర్లేనన్నారు. ప్రస్తుతం అమెరికాలో తమకు 6,944 చార్జింగ్ స్టేషన్లున్నట్టు బ్లింక్ ప్రకటించింది.
Blink Charging Co
Tesla
USA

More Telugu News