Galla Jayadev: ఏపీలో అరాచక పాలనపై సాక్ష్యాధారాలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి తెలియజేశాం: టీడీపీ ఎంపీలు

  • అజయ్ భల్లాతో గల్లా జయదేవ్, కనకమేడల భేటీ
  • ఏపీ పరిస్థితులపై ఫిర్యాదులు  
  • హోంశాఖ కార్యదర్శి సానుకూలంగా విన్నారన్న టీడీపీ ఎంపీలు
  • అమిత్ షాకు వివరిస్తానని హామీ ఇచ్చారని వెల్లడి
TDP Parliamentarians Galla Jaydev and Kanakamedala met Union Home Ministry Secreatary

టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ ఈ మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో జరుగుతున్న అరాచక పాలన గురించి సాక్ష్యాధారాలతో సహా కేంద్ర హోంశాఖ కార్యదర్శికి తెలియజేశామని వెల్లడించారు.

ఏపీలో మతమార్పిళ్లు, ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, విపక్షనేతలపై దాడులు, అక్రమ కేసులు, రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు, అధికారుల విధులకు అడ్డుతగలడం, న్యాయ వ్యవస్థలపైనా దాడులు... తదితర అంశాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వివరించామని టీడీపీ ఎంపీలు తెలిపారు.

పోలీస్ అధికారులు సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా, అధికార పక్షానికి కొమ్ముకాసే రీతిలో వ్యవహరిస్తున్న అంశాన్ని కూడా హోంశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన తమ ఫిర్యాదులను సానుకూలంగా విన్నారని గల్లా జయదేవ్, కనకమేడల వెల్లడించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఏపీ పరిస్థితులపై ఇప్పటికే కొంత అవగాహన ఉందని, ఇంకొన్ని విషయాలను తమను అడిగి తెలుసుకున్నారని ఎంపీలు వివరించారు. వీటిపై మరింత సమాచారం సేకరించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వివరిస్తానని అజయ్ భల్లా హామీ ఇచ్చారని ఎంపీలు తెలిపారు.

More Telugu News