Team India: చెన్నై టెస్టులో భారత్ ఘోర పరాజయం

  • 227 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియా
  • భారత్ బ్యాటింగ్ లైనప్ ను కూల్చిన లీచ్, ఆండర్సన్
  • ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
  • 1–0 ఆధిక్యంలో ఇంగ్లండ్
England Outclass India In Chennai To Take Series Lead

కంగారూలను వారి సొంతగడ్డపైనే ఓడించి చరిత్ర సృష్టించిన టీమిండియా.. తన సొంత గడ్డపై ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా పర్యటనలో గెలుపు జోష్ లో ఇంగ్లండ్ తో అమీతుమీకి సిద్ధమైన టీమిండియా.. బొక్కబోర్లా పడింది. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది.

మరోవైపు ఇంగ్లండ్ తన భారత పర్యటనను ఘనంగా ఆరంభించింది. 227 పరుగులతో జయభేరి మోగించి సిరీస్ లో 1–0 ఆధిక్యాన్ని సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ద్విశతకం బాదిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఐదోరోజు ఆట ప్రారంభించిన భారత్ ను ఇంగ్లండ్ బౌలర్లు జాక్ లీచ్ (4 వికెట్లు), జేమ్స్ ఆండర్సన్ దెబ్బ కొట్టారు. ఆండర్సన్ కు మూడు వికెట్లు దక్కాయి. టీమిండియా బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ (72), శుభ్ మన్ గిల్ మినహా ఎవరూ రాణించలేదు. ఆచితూచి ఇన్నింగ్స్ ఆడుతున్న కోహ్లీని బెన్ స్టోక్స్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ విజయం లాంఛనమే అయింది.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 578, రెండో ఇన్సింగ్స్ లో 178 పరుగులు చేయగా, భారత్ వరుసగా 337, 192 పరుగులకు ఆలౌట్ అయింది. వాస్తవానికి ఫాలో ఆన్ గండంలో పడినా ఇండియాను ఇంగ్లండ్ ఫాలో ఆన్ ఆడించలేదు. కాగా, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా నాలుగు టెస్టుల్లో ఓడింది.

 ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి పెంచలేకపోయామని కోహ్లీ అన్నాడు. పరుగులకు అడ్డుకట్ట వేయలేకపోయామన్నాడు. పిచ్ స్లోగా ఉండడం వల్ల బౌలింగ్ కు అనుకూలించలేదని, దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ స్ట్రయిక్ రొటేట్ చేయగలిగారని అన్నాడు.

More Telugu News