Sunil Gavaskar: గోడ అంటారో.. రాయే అంటారో.. టీమిండియాకు పుజారానే వెన్నెముక: సునీల్​ గవాస్కర్​

  • స్ట్రయిక్ రేట్ చూసి అతడి విలువను తగ్గిస్తున్నారని అసహనం
  • బ్యాటింగ్ ను ఏకతాటిపై ఉంచేది పుజారానేనని ప్రశంస
  • అతడి శైలి వల్లే వేరే ప్లేయర్లు షాట్లు ఆడుతున్నారని వ్యాఖ్య
  • పుజారా బ్యాటింగ్ వల్లే ఆస్ట్రేలియాలో గెలిచామని వెల్లడి
India vs England Cheteshwar Pujaras importance to team is underrated says Sunil Gavaskar

చటేశ్వర్ పుజారా.. టీమిండియా ‘వాల్ 2.0’ అని క్రికెట్ అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు. మరో ద్రవిడ్ అని క్రికెట్ పండితులు అంటుంటారు. అయితే, అతడికి సరైన ప్రాధాన్యం దక్కట్లేదని మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అంటున్నాడు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కు పుజారానే వెన్నెముక అని, బ్యాటింగ్ ను ఏకతాటిపై నిలబెడుతున్నది అతడేనని అన్నాడు.

‘‘ఎంతసేపైనా క్రీజులో పాతుకుపోయే సామర్థ్యం పుజారా సొంతం. ప్రత్యర్థిని విసిగించడమొక్కటే కాదు.. మరో వైపు ఉన్న ఆటగాడు షాట్లు కొట్టేలా అతడి ఆట ప్రోత్సహిస్తుంది. పుజారా ఉన్నాడన్న ధైర్యంతో ఆటగాళ్లు షాట్లు ఆడతారు. టీం ఆలౌటవుతుందన్న భయం ఉండదు. ఆస్ట్రేలియా పర్యటనలోని అన్ని చేజింగ్ లనూ చూస్తే అదే అర్థమవుతుంది. సిడ్నీలో పుజారా, పంత్ జోడీ వల్ల దాదాపు గెలిచినంత పనిచేశాం. బ్రిస్బేన్ లోనూ పుజారా బలమైన ఇన్నింగ్సే గెలుపునకు బాటలు పరిచింది. అతడు నిదానంగా ఆడుతుంటే స్ట్రోక్ ప్లేయర్లు షాట్లు కొట్టారు’’ అని గవాస్కర్ అన్నాడు.

జట్టుకు పుజారా చాలా విలువైన ఆటగాడు అని తేల్చి చెప్పాడు. ఎప్పుడూ స్ట్రైక్ రేట్ ను చూపిస్తూ అతడి విలువను తగ్గిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రారంభంలోనే వికెట్ కోల్పోతే.. తానున్నానంటూ ఇన్నింగ్స్ కు పునాదులు వేస్తాడని, ఆ ఆటతోనే అతడు ప్రత్యేకంగా నిలుస్తున్నాడని చెప్పాడు. గోడ అంటారో.. రాయి అంటారో.. ఏదైనా గానీ.. టీమిండియా బ్యాటింగ్ ను వెన్నెముకల మారి ఏకతాటిపై నిలబెడుతున్నాడని వ్యాఖ్యానించాడు. ఆ విషయాన్ని ఎప్పుడూ మరిచిపోవద్దన్నాడు.

More Telugu News