Nirmala Sitharaman: ద్రవ్య లోటు నియంత్రణే 'మూల మంత్రం': నిర్మలా సీతారామన్

  • కరోనా కారణంగా భారీగా పెరిగిన ద్రవ్య లోటు
  • 9.5 శాతానికి చేరుకున్న లోటు
  • ఆదాయానికి మించిన ఖర్చు చేయాల్సి వచ్చింది
  • పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో నిర్మల
Controling Fiscle Deficit is Mool Mantra says Nirmala Seetaraman

గత సంవత్సరం కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు జీడీపీలో 9.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్న వేళ, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ద్రవ్య లోటును నియంత్రణలో ఉంచడమే ప్రస్తుత 'మూల మంత్రం' అని వ్యాఖ్యానించిన ఆమె, కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం పలు చర్యలను తీసుకోనుందని అన్నారు. పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

ఈ సంవత్సరం ద్రవ్య లోటు 3.5 శాతంగా ఉంటుందని తొలుత అంచనా వేశామని, అయితే, మహమ్మారి కారణంగా ఇది ఎంతో పెరిగిపోయిందని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ఆదాయానికి మించిన ఖర్చును కేంద్రం చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇక రానున్న ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 6.8 శాతానికి తగ్గించాలని ఇప్పటికే నిర్ణయించామని, 2025-26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

ఇటీవలి కేంద్ర బడ్జెట్ ను అత్యంత పారదర్శకంగా రూపొందించామని, ఏ విషయాన్నీ దాచి పెట్టలేదని అన్నారు. ప్రభుత్వ వ్యయాలు, కేటాయింపులన్నీ తెరచిన పుస్తకమేనని, ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చని నిర్మల పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకు తెలిపారు. దీర్ఘకాల మౌలిక వసతుల ప్రాజెక్టులకు మరిన్ని నిధులను కేటాయించామని, ఇవి దేశంలో ఉద్యోగావకాశాలను పెంచుతాయని అన్నారు. దేశంలో ఎన్నో ప్రైవేటు డీఎఫ్ఐ (డెవలప్ మెంట్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్)లు పెరుగుతున్నాయని, వీటి మధ్య పోటీ అభివృద్ధిని మరింతగా పెంచుతుందని అభిప్రాయపడ్డారు.

More Telugu News