KCR: పంచాయతీలు తమ నిధులు సంపూర్ణంగా వినియోగించుకునే హక్కు ఉంది... ఇందులో ఎవరి జోక్యం అక్కర్లేదు: సీఎం కేసీఆర్

  • స్థానిక సంస్థల బలోపేతంపై సీఎం కేసీఆర్ సమీక్ష
  • స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేస్తామని వెల్లడి
  • జడ్పీ, మండల పరిషత్ లకు కూడా నిధులు ఇస్తామని వివరణ
  • కొత్త చట్టంపై అధికారులు మరింత స్పష్టత ఇవ్వాలని సూచన
CM KCR review on local bodies

రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు ఇస్తున్న విధంగానే జడ్పీ, మండల పరిషత్ లకు కూడా నిధులు కేటాయిస్తామని అన్నారు. వాటికి ప్రత్యేకమైన విధులను కూడా అప్పగిస్తామని తెలిపారు. స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామని చెప్పారు. 2021-22 బడ్జెట్లోనే జిల్లా, మండల పరిషత్ లకు నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.

అంతేకాకుండా... మండల, జిల్లా స్థాయి అధికారుల అనుమతులతో పనిలేకుండానే గ్రామ పంచాయతీలు తమ నిధులను సంపూర్ణంగా వినియోగించుకునే అధికారం కొత్త పంచాయతీరాజ్ చట్టం కల్పించిందని, దీన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించిన పనుల మంజూరుకు మండల అధికారుల నుంచి అనుమతి పొందాలనే పాత నిబంధన అమలు చేస్తున్నారని, ఇది కొత్త చట్టానికి విరుద్ధం అని అన్నారు. గ్రామ పంచాయతీలు తమ నిధులను గ్రామ అవసరాలు తీర్చడానికి సంపూర్ణంగా వినియోగించుకునే హక్కు ఉందని, ఇందులో ఎవరి జోక్యం అక్కర్లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులు మరోసారి స్పష్టత ఇవ్వాలని సూచించారు.

More Telugu News