Sachin Tendulkar: నాడు షరపోవాను తిట్టిన నోళ్లే నేడు పొగుడుతున్నాయి!

Netizens Love and Efection on Tennis Star Maria Sharapova
  • ఆరేళ్ల నాడు సచిన్ తెలియదన్న షరపోవా
  • తీవ్రంగా విమర్శలు గుప్పించిన ఫ్యాన్స్
  • తాజాగా ఇంటర్నేషనల్ సెలబ్రిటీలను వ్యతిరేకిస్తూ సచిన్ ట్వీట్
  • రైతులకు వ్యతిరేకమంటూ సచిన్ పై ఆగ్రహం
మారియా షరపోవా... టెన్నిస్ ప్రపంచంలో దిగ్గజ క్రీడాకారిణి. రష్యాకు చెందిన ఈమె గురించి భారత క్రీడాభిమానులకు ఎంతో తెలుసు. ఇదే సమయంలో దాదాపు ఆరేళ్ల క్రితం 'సచిన్ టెండూల్కర్ అంటే ఎవరో నాకు తెలియదు' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యపై ఎంత ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయో అందరికీ తెలిసిందే.

అప్పట్లో ఆమె సామాజిక మాధ్యమాలలో, మనవాళ్లు పెట్టిన కామెంట్లు, చూపిన వ్యతిరేకత అంతా ఇంతా కాదు. అయితే, నాడు తిట్టిన వాళ్లే నేడిప్పుడు ఆమెను పొగుడుతున్నారు. తమను క్షమించాలని వేడుకుంటున్నారు. 'నువ్వు చెప్పింది నిజమే. సచిన్ నీకు తెలిసి ఉండాల్సినంత వ్యక్తేమీ కాదు. అతనేమీ అంత గొప్పవాడు కాదు' అని పోస్టులు పెడుతున్నారు.

ఇండియన్ నెటిజన్లు ఇలా మారడానికి కారణం ఏంటో తెలుసా? ఇటీవల ఇండియాలో జరుగుతున్న రైతు నిరసనలపై పాప్ స్టార్ రిహన్నా తదితరులు ట్వీట్లు చేసిన తరువాత వారిపై భారత సెలబ్రిటీలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే, "ఇది మా సొంత విషయం. ఇండియా తన సార్వభౌమాధికార విషయంలో రాజీ పడబోదు. బయటి వారు వీక్షకులు మాత్రమే. భాగస్వాములు మాత్రం కాబోరు" అని సచిన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే భారత క్రీడాభిమానులకు, ముఖ్యంగా రైతు నిరసనలకు మద్దతిస్తున్న వారికి, వారికి సంఘీభావంగా ఉన్న వారికీ ఆగ్రహాన్ని తెప్పించింది.

రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను సచిన్ ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం జరగడంతో ఆయనపై ఆగ్రహంగా ఉన్న నెటిజన్లు, ఇప్పుడు మారియా షరపోవా ఆరేళ్ల నాటి వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ, సచిన్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నాడు షరపోవాను తీవ్రంగా విమర్శించిన మలయాళీలు, ఇప్పుడామెను క్షమాపణలు కోరుతున్నారు. తాను చెప్పింది సరైనదేనని, ఇండియాకు వచ్చి తమ ఆతిథ్యం తీసుకోవాలని కోరుతున్నారు. నాడు మీపై సైబర్ దాడి చేసినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నామని ఒకరు, సారీ సిస్టర్ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు.
Sachin Tendulkar
Maria Sharapova
Netizens
Love

More Telugu News