Madhya Pradesh: చికిత్సకు ఫీజు అడిగిన డాక్టర్.. ఆయన వేలు కొరికి చేతిలో పెట్టిన యువకుడు!

  • మధ్యప్రదేశ్‌లోని చింద్వాడాలో ఘటన
  • కాలిన చేతికి వైద్యం కోసం వచ్చిన బాధితుడు
  • చికిత్స అనంతరం ఫీజు అడిగితే క్లినిక్ ధ్వంసం
  • ఇద్దరు నిందితుల అరెస్ట్
chhindwara man cuts doctors finger for pay fee

కాలిన చేతికి చికిత్స కోసం వచ్చిన వ్యక్తికి వైద్యం చేసిన డాక్టర్ అనంతరం ఫీజు అడిగితే ఆయన చేతి వేలినే కొరికి చేతిలో పెట్టాడో ప్రబుద్ధుడు. మధ్యప్రదేశ్‌లోని చింద్వాడాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కుండీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శనిచరా బజార్‌లో డాక్టర్ ఎస్‌కే బింద్రా ఓ క్లినిక్ నిర్వహిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ వ్యక్తి చేతికి కాలిన గాయాలతో క్లినిక్‌కు వచ్చాడు. అతడి వెంట మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

డాక్టర్ బింద్రా వెంటనే అతడికి చికిత్స అందించారు. అనంతరం ఫీజు అడగ్గా బాధితుడితోపాటు, అతడి వెంట వచ్చిన వారు రెచ్చిపోయారు. క్లినిక్‌పైనే దాడికి యత్నించారు. అడ్డుకోబోయిన బింద్రా చేతి వేలిని బాధితుడితోపాటు వచ్చిన విజయ్ తివారీ అనే వ్యక్తి కొరికి చేతి నుంచి వేలిని వేరు చేశాడు. అనంతరం క్లినిక్‌లోని వస్తువులపై ప్రతాపం చూపించి వెళ్లిపోయారు. డాక్టర్ బింద్రా ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News