Kyle Mayers: అరంగేట్రం మ్యాచ్ లోనే డబుల్ సెంచరీ చేసిన కైల్ మేయర్స్... ఓడిపోతుందనుకున్న మ్యాచ్ లో నెగ్గిన వెస్టిండీస్

  • చట్టోగ్రామ్ లో బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు
  • 3 వికెట్ల తేడాతో నెగ్గిన వెస్టిండీస్
  • 210 పరుగులతో అజేయంగా నిలిచిన మేయర్స్
  • 395 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన విండీస్
Kyle Mayers registers a double ton in his first test as West Indies beat Bangladesh

టెస్టు క్రికెట్ చరిత్రలో మరో చిరస్మరణీయ ఘట్టం నమోదైంది. బంగ్లాదేశ్ తో చట్టోగ్రామ్ లో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ జట్టు అద్భుత విజయం సాధించింది. 395 పరుగుల విజయలక్ష్యాన్ని విండీస్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అలాగని వెస్టిండీస్ జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఎవరూ లేరు. క్రిస్ గేల్, పొలార్డ్, బ్రావో వంటి దిగ్గజాలు అసలే లేరు. కానీ, కరీబియన్లు బంగ్లాదేశ్ ను వారి సొంతగడ్డపైనే మట్టికరిపించారు.

ఈ గెలుపులో హీరో అంటే కైల్ మేయర్స్ అని చెప్పాలి. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ చరిత్రలో నిలిచిపోయే రీతిలో డబుల్ సెంచరీ సాధించి లక్ష్యఛేదనలో అపూర్వ విజయాన్ని అందించాడు. 210 పరుగులు చేసిన మేయర్స్ చివరి వరకు అజేయంగా నిలిచాడు. మేయర్స్ స్కోరులో 20 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఇంతజేసీ, కైల్ మేయర్స్ కు ఇదే తొలి టెస్టు. అరంగేట్రం మ్యాచ్ లోనే ద్విశతకం సాధించిన తొలి వెస్టిండీస్ ఆటగాడిగా మేయర్స్ రికార్డు నమోదు చేశాడు.

 స్పిన్ కు సహకరించే బంగ్లాదేశ్ పిచ్ లపై 395 పరుగుల లక్ష్యఛేదన అంటే మాటలు కాదు. పైగా వెస్టిండీస్ జట్టు 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో ఎన్ క్రుమా బోనర్ (86)తో కలిసి భారీ భాగస్వామ్యం నమోదు చేసిన మేయర్స్ విండీస్ ను విజయతీరాలకు చేర్చాడు. చివర్లో అతడికి జాషువా డ సిల్వా (20) నుంచి మెరుగైన సహకారం లభించిడంతో ఘనవిజయం చేజిక్కింది.

More Telugu News