Tallest Building: హైదరాబాదులో ఎత్తైన భవన సముదాయం ఇదే... 501 అడుగుల అపార్ట్ మెంట్ కు జీహెచ్ఎంసీ అనుమతి

  • అత్యంత ఎత్తయిన భవనం నిర్మిస్తున్న సుమధుర గ్రూప్
  • 44 అంతస్తులతో ట్విన్ టవర్స్
  • 5.5 ఎకరాల భూమిలో 846 ఫ్లాట్లు
  • 42 అంతస్తుల భవనం రికార్డు తెరమరుగు!
GHMC gives approval for tallest building in Hyderabad

హైదరాబాదు నగరంలో ఇప్పటివరకు అత్యంత ఎత్తయిన భవంతి అంటే 42 అంతస్తుల ఓ బిల్డింగ్ గురించి చెప్పుకునేవారు. ఇప్పుడా రికార్డును సుమధుర గ్రూప్ బద్దలు కొట్టేందుకు సిద్ధమైంది. నానక్ రామ్ గూడలో 44 అంతస్తుల ఎత్తయిన భవన సముదాయం నిర్మించేందుకు సుమధుర గ్రూప్ కు జీహెచ్ఎంసీ పచ్చజెండా ఊపింది. ఈ నూతన భవన సముదాయం ఎత్తు 501 అడుగులు.

అయితే ఈ భవంతిని మించిపోయేలా మరింత ఎత్తయిన నిర్మాణాల కోసం వచ్చిన అనుమతులను జీహెచ్ఎంసీ పరిశీలనలో ఉంచింది. నార్సింగి సమీపంలోని పుప్పాలగూడ వద్ద 55 అంతస్తుల భవనాలు నిర్మించేందుకు వచ్చిన రెండు దరఖాస్తులకు జీహెచ్ఎంసీ ఇంకా ఆమోదం తెలుపలేదు. ఈ భవనాల కారణంగా నగరంలో మరింతగా ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయేమోనన్న అంశాన్ని అధికారులు సమీక్షిస్తున్నారు.

నగరంలో ఎత్తయిన భవనాలు నిర్మించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 6 నాటికి 10 దరఖాస్తులు రాగా, వాటిలో ఎనిమిదింటికి అధికారులను అనుమతి ఇచ్చారు. సుమధుర గ్రూప్ కు చెందిన భవనం వీటిలో అత్యంత ఎత్తయినది. ట్విన్ టవర్స్ తరహాలో నిర్మితమవుతున్న ఈ భవన సముదాయం 5.5 ఎకరాల భూమిలో నిర్మితమవుతోంది. ఈ రెండు టవర్లలో 846 ఫ్లాట్లు ఉంటాయని సుమధుర గ్రూప్ ప్రతినిధి తెలిపారు.

More Telugu News