COVID19: పిల్లలపైనా కొవాగ్జిన్ ట్రయల్స్!

  • ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెల ప్రారంభంలో మొదలు
  • 2 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారిపై ట్రయల్స్
  • మూడు విభాగాలుగా చేయనున్న సంస్థ
  • అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ప్రస్తుతం కొవాగ్జిన్ ఒక్కటే ప్రత్యామ్నాయం
Covaxin trials for kids likely soon Bharat Biotech awaits nod

పిల్లలను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఇంకా భయపడుతూనే ఉన్నారు. ఎక్కడ మహమ్మారి తగులుకుంటోందనని ఆందోళన చెందుతున్నారు. పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడేస్తారా అని ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్పటిదాకా ముప్పు ఎక్కువగా ఉండే వారికి, కరోనా ముందు వరుస యోధులకు మాత్రమే టీకాలు వేస్తున్నారు. ఇక, 18 ఏళ్ల లోపు పిల్లలకు వేయొద్దన్న ఆదేశాలూ ఉండనే ఉన్నాయి. ఇప్పటిదాకా పిల్లలపై వ్యాక్సిన్ ప్రభావం తెలుసుకునేందుకు ట్రయల్స్ కూడా జరగలేదు.

ఈ నేపథ్యంలోనే భారత్ బయోటెక్ ముందడుగు వేసింది. ఇప్పటికే 12 ఏళ్ల పిల్లలకూ తమ వ్యాక్సిన్ కొవాగ్జిన్ ను ఇవ్వొచ్చని సంస్థ ప్రకటించింది. తాజాగా పిల్లలపై పెద్ద సంఖ్యలో ట్రయల్స్ కు సిద్ధమవుతోంది. ఈ నెలాఖరు నాటికి లేదా మార్చి ప్రారంభానికి ట్రయల్స్ ను మొదలు పెట్టాలని భావిస్తోంది.

రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలపై ట్రయల్స్ చేయబోతున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ట్రయల్స్ మొదలవుతాయి. కాగా, జనవరిలోనే సంస్థ ఎండీ కృష్ణా ఎల్ల.. ఈ ఏడాది మే కల్లా పిల్లలకూ కరోనా టీకాను సిద్ధం చేస్తామని ప్రకటించారు.

ప్రపంచంలోనే పిల్లలపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ చేస్తున్న మొట్టమొదటి సంస్థగా భారత్ బయోటెక్ రికార్డులకెక్కుతుందని ఆ ట్రయల్స్ ను పర్యవేక్షించనున్న డాక్టర్ ఆశిష్ తాంజే చెప్పారు. పిల్లలపై ట్రయల్స్ ను మూడు విభాగాలుగా చేస్తామన్నారు. 2 నుంచి 5 ఏళ్లు, 6 నుంచి 12, 12 నుంచి 18 ఏళ్లుగా విభజించి ట్రయల్స్ నిర్వహిస్తామన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ప్రొటోకాల్ పాటిస్తామని వివరించారు. త్వరలోనే ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ ప్రయోగాలనూ చేస్తామని తెలిపారు.

అంతర్జాతీయ నిబంధనల ప్రకారం పిల్లలకు కేవలం జీవం లేని వైరస్ లతో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లనే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్ మినహా.. మిగతా వ్యాక్సిన్లు ఎంఆర్ఎన్ఏ లేదా చింపాంజీ అడినోవైరస్ ల ఆధారంగా తయారవుతున్న వ్యాక్సిన్లు. కాబట్టి వాటిని పిల్లలకు ఇవ్వడం నిషిద్ధం. ఈ  నేపథ్యంలోనే కొవాగ్జిన్ ట్రయల్స్ కు ప్రాధాన్యం సంతరించుకుంది.

More Telugu News