మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ సచిన్ కు శరద్ పవార్ సలహా!

07-02-2021 Sun 06:47
  • భారతీయులకు భారత్ గురించి తెలుసు
  • రిహన్నా ట్వీట్ కు వ్యతిరేకంగా సచిన్ వ్యాఖ్య
  • మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించిన పవార్
Sharad Pawar Advice to Sachin
పాప్ స్టార్ రిహన్నా భారత రైతులపై చేసిన ట్వీట్ కు స్పందనగా వ్యాఖ్యానించిన భారత సెలబ్రిటీల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. 'భారతీయులకు భారతావని గురించి తెలుసు' అన్న సచిన్ వ్యాఖ్యలు వైరల్ కాగా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సచిన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఏదైనా మరో రంగం గురించి మాట్లాడే ముందు సచిన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి' అని ఆయన అన్నారు.

రైతుల నిరసనల వెనుక ఖలిస్థానీలు లేదా ఉగ్రవాదులు ఉన్నారని కొందరు కేంద్ర పెద్దలు చేసిన వ్యాఖ్యలపై కూడా పవార్ విమర్శలు గుప్పించారు.నిరసనకారులంతా రైతులేనని స్పష్టం చేసిన ఆయన, వారంతా దేశానికి అన్నం పెడుతున్న వారని, వారిని ఖలిస్థానీలు, ఉగ్రవాదులు అనవద్దని యూపీఏ హయాంలో వ్యవసాయ మంత్రిగానూ ఉన్న శరద్ పవార్ వ్యాఖ్యానించారు.

కాగా, గతంలో ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్న వేళ, ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేలా సంస్కరణలు తీసుకుని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓ లేఖను రాయగా, దాన్ని బీజేపీ బయటపెట్టి, విమర్శలు గుప్పిస్తూ, రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నారని మండిపడిన సంగతి తెలిసిందే.

రిహన్నా, పర్యావరణ కార్యకర్త గ్రెటా థెన్బర్గ్ ట్వీట్ కు వ్యతిరేకంగా సచిన్ తో పాటు విరాట్ కోహ్లీ, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లతో పాటు లతా మంగేష్కర్ వంటి వారు ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.