ఇండొనేషియాలో రక్తపు వర్షం... ప్రపంచానికి అంతమంటున్న ప్రజలు... వీడియో ఇదిగో!

07-02-2021 Sun 06:41
  • కేంద్ర జావా పరిధిలోని పెకలోంగాన్ సమీపంలో వాన
  • భయపడ్డామని చెబుతూ వీడియోలు పోస్ట్ చేసిన ప్రజలు
  • మైనపు కర్మాగారంలోని రంగే కారణమన్న అధికారులు
Blood Rain in Indonesia and People Says this is the World End
ఇండొనేషియాలోని ఓ గ్రామంలో వర్షం కురవగా అది ఎరుపు రంగులో రక్తం మాదిరిగా కనిపిస్తూ, ఏరులై పారగా, ప్రపంచ అంతానికి ఇదే ఆరంభమని ప్రజలు తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేశారు. రక్తపు వర్షానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు వైరల్ అయ్యాయి. వేలమంది సామాజిక మాధ్యమ యూజర్లు తమ ముందు జరిగిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు. కేంద్ర జావా పరిధిలోని పెకలోంగాన్ నగరానికి సమీపంలోని గ్రామంలో ఈ ఘటన సంభవించింది.

"గతంలో ఎన్నడూ చూడని విధంగా రక్తపు వర్షం ఏరులై పారింది. ఇదే ప్రపంచ వినాశనం" అని ట్విట్టర్ యూజర్ అయాహ్ ఈ అరెక్ వ్యాఖ్యానించారు. తన కళ్ల ముందు కనిపించిన దృశ్యాలను చూసి చాలా భయపడ్డానని అన్నారు.

కాగా, ఈ ప్రాంతంలో ఉన్న ఓ మైనపు సంస్థలోని ఎరుపు రంగు వ్యర్థం నీటిలో కలిసినందునే వర్షపు నీరు ఎరుపు రంగులోకి మారిందని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ గ్రామంలో వర్షం కురిసినప్పుడు నీరు రంగు మారడం ఇదే తొలిసారేమీ కాకపోవడం గమనార్హం. గత నెలలో ఓ మారు వర్షం కురిసినప్పుడు నీరు ఆకుపచ్చ రంగులోకి మారింది. అంతకుముందు మరోమారు నీరు ఊదా రంగులోనూ కనిపించిందని అదే ప్రాంతానికి చెందిన మరో ట్విట్టర్ యూజర్ అరియా జూలిద్ వ్యాఖ్యానించారు.

దీనిపై వివరణ ఇచ్చిన ఇండొనేషియా డిజాస్టర్ రిలీఫ్ టీమ్ సభ్యుడు ఆర్గా యుధా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న చిత్రాలు నిజమైనవేనని, అయితే వీటిని చూసి తీవ్రంగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏ మాత్రమూ లేదని అన్నారు.