Chandrababu: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలని చూస్తే మరో ఉక్కు ఉద్యమం తప్పదు: చంద్రబాబు

Chandrababu gets anger over Visakha Steel Plant issue
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • విశాఖ ఉక్కు ఆంధ్రుల శాశ్వత హక్కు అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు
  • జనాన్ని ఏమార్చుతున్నారంటూ జగన్ పై విమర్శలు
  • తుక్కు కింద కొనేసే పన్నాగమని వెల్లడి
  • కర్మాగారాన్ని కాపాడాల్సిన బాధ్యత సీఎంపై ఉందని ఉద్ఘాటన
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల శాశ్వత హక్కు అని ఉద్ఘాటించారు. ఈ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తే మరో ఉక్కు ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

లక్షల మంది ప్రజలు ఏళ్ల తరబడి ఉద్యమించారని, 32 మంది ప్రాణత్యాగం చేశారని, అమరావతి వాసి అమృతరావు ఆమరణ నిరాహార దీక్షతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నామని చంద్రబాబు వివరించారు. అటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తుక్కు కింద కొనేసి లక్షల కోట్లు కొట్టేసేందుకు జనాన్ని ఏమార్చుతున్నారని, జగన్ గ్యాంగ్ కుతంత్రాన్ని ప్రజల మద్దతుతో అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.

"అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే పరిపాలనా రాజధాని అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డీ... నువ్వు ఇప్పటికే ఆ పేరుతో విశాఖలో కొండలు, గుట్టలు మింగేశావు. భూములు ఆక్రమించేశావు. ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డావా?" అని చంద్రబాబు ప్రశ్నించారు. 18 వేల మంది పర్మినెంటు ఉద్యోగులు, 22 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రత్యక్షంగానూ, లక్ష మందికి పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తుంటే ఒక సీఎంగా నీ బాధ్యత ఏంటని జగన్ ని నిలదీశారు.

"నీపై ఉన్న 31 కేసుల మాఫీ కోసం 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్ సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యుల్ని కేంద్రానికి తాకట్టు పెట్టావు. ప్రత్యేక హోదాని బాబాయ్ హత్యకేసు కోసం తనఖా పెట్టేశావు. ఇప్పుడు విశాఖ ఉక్కుపై స్పందించవద్దంటూ నీ ఎంపీల నోరు కుట్టేశావు" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో ఇదే పరిస్థితి వస్తే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడింది అప్పటి టీడీపీ ప్రభుత్వమేనని చంద్రబాబు వెల్లడించారు. ఆ పని ఇప్పుడు మీరెందుకు చేయడంలేదని నిలదీశారు. "ఢిల్లీని ఢీకొడతా, మోదీ మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికే జగన్ రెడ్డీ... నీ క్విడ్ ప్రోకో బుద్ధిని పక్కనబెట్టు. తెలుగు ప్రజల ఉద్యమ ఫలం, విశాఖ మణిహారం ఉక్కు కర్మాగారాన్ని కాపాడాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీపై ఉందని గుర్తుంచుకో" అంటూ హితవు పలికారు.
Chandrababu
Jagan
Visakha Steel Plant
Privatisation
Andhra Pradesh

More Telugu News