COVID19: ‘ఇండియాకు ఇమ్యూనిటీ’.. భారీగా తగ్గిపోతున్న కరోనా కేసులు!

  • పలు కారణాలను వివరిస్తున్న శాస్త్రవేత్తలు, నిపుణులు
  • రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ప్రభావం తగ్గిందన్న భావన
  • యువత ఎక్కువగా ఉండడమూ మేలు చేసిందని వివరణ
  • 27 కోట్ల మందిలో యాంటీబాడీలున్నట్టు సీరో సర్వేల్లో వెల్లడి
  • కరోనా వ్యాప్తిని అడ్డుకున్న వేడి వాతావరణం
The mystery behind Indias declining Covid cases

ఐదు నెలల కిందటి మాట.. దేశంలో కరోనా కేసులు ఒకానొక టైంలో రోజుకి దాదాపు లక్ష దాకా నమోదయ్యాయి. ప్రపంచంలోనే అప్పుడు అదే అత్యధికం. అమెరికానే అనుకుంటే దానికి మించి కరోనా మహమ్మారి కోరలు చాచింది. ఇంకేముంది.. భారత్ లో కరోనా ముప్పు చాలా ఎక్కువ అని, రెండో వేవ్ తప్పదని చాలా మంది నిపుణులు హెచ్చరించారు కూడా. కానీ, ఇప్పటి పరిస్థితి వేరు.

అమెరికా, బ్రిటన్, రష్యా, బ్రెజిల్.. ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాని రీతిలో భారత్ లో కరోనా కేసులు తగ్గిపోయాయి. రోజురోజుకూ తగ్గుతున్నాయి. మరణాలూ భారీగా పడిపోయాయి. లాక్ డౌన్లు ఎత్తేసినా, పండుగలు వచ్చినా కేసులు అంతగా నమోదు కాలేదు. ఇప్పుడు సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఉద్యమాలు చేస్తున్నా కేసులు రాలేదు. దీనికి కారణమేంటి? శాస్త్రవేత్తలు, నిపుణులు దానికి ఎన్నెన్నో కారణాలు, సిద్ధాంతాలను వివరిస్తున్నారు.

ముందు నుంచీ రోగనిరోధక శక్తి

మిగతా దేశాలతో పోలిస్తే భారతీయులకు ఉన్న రోగ నిరోధక శక్తే గొప్ప వరమని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, హెపటైటిస్, కలరా తదితర వ్యాధులకు గురయ్యారని, దాని వల్ల మన వారికి రోగ నిరోధక శక్తి పెరిగిందని చెబుతున్నారు. కొన్ని సర్వేల ప్రకారం వైద్య సదుపాయాలు, పరిశుభ్రత తక్కువగా ఉన్న అల్పాదాయ, మధ్యస్థ ఆదాయ దేశాల్లో కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయి. అయితే, ఇప్పటికే వివిధ బ్యాక్టీరియాలు, ఇతర వ్యాధికారక సూక్ష్మజీవులు సోకి వ్యాధులు వచ్చిన వారుండే దేశాల్లో కేసులు, మరణాలు తగ్గాయని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి చెందిన ఓ శాస్త్రవేత్త చెప్పారు.

యువ బలం

దేశానికి మరో బలం యువత. అవును, దేశంలో 65 ఏళ్లు పైబడిన వారు కేవలం 6 శాతమే ఉన్నారు. సగానికిపైగా 25 ఏళ్లలోపు వారే. దాని వల్లే వైరస్ వ్యాపించినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందన్నది నిపుణుల మాట. మామూలుగానే యుక్త వయసులో ఉన్న వారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, మన దగ్గర వృద్ధుల శాతం తక్కువ కాబట్టి వైరస్ ప్రభావం చాలా వరకు తగ్గిందని అంటున్నారు.

సామూహిక రోగ నిరోధక శక్తి వచ్చిందా?

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఇటీవలి సీరో సర్వేల్లో ప్రతి ఐదుగురిలో ఒకరికి (22%) కరోనా యాంటీ బాడీలున్నట్టు తేలింది. 28,600 మంది రక్త నమూనాలను పరీక్షించి కేంద్రం ఈ నిర్ధారణకు వచ్చింది. ఆ లెక్కన మొత్తం దేశవ్యాప్తంగా 27 కోట్ల మందికి కరోనా సోకి ఉంటుందని, వారిలో యాంటీ బాడీలు తయారై ఉంటాయని అంచనా వేసింది. కాగా, ఒక్క ఢిల్లీలో 28 వేల మందిపై అధ్యయనం చేస్తే 56 శాతం మందిలో కరోనా ప్రతి రక్షకాలు ఏర్పడినట్టు గుర్తించింది. దీని వల్ల కూడా కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అయితే, అప్పుడే సామూహిక రోగ నిరోధక శక్తి (హెర్డ్ ఇమ్యూనిటీ) వచ్చినట్టు చెప్పలేమని అంటున్నారు. కనీసం 60 నుంచి 80 శాతం మందిలో కరోనా ప్రతిరక్షకాలుంటేనే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పొచ్చన్నారు. ఇక, ఇప్పుడు కరోనా వ్యాక్సినేషన్ మొదలైపోవడమూ కేసుల సంఖ్య తక్కువగా నమోదు కావడానికి కారణమని వివరిస్తున్నారు.  

వాతావరణం

మన దేశంలోని వెచ్చటి, తేమ వాతావరణం కరోనా కేసులు తక్కువగా నమోదవడంలో ఓ కారణమన్నది శాస్త్రవేత్తల వివరణ. మామూలుగా కరోనా వైరస్ తక్కువ ఉష్ణోగ్రతల్లోనే బతుకుతుందని, కానీ, భారత్ లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల వైరస్ వృద్ధి చెందేందుకు అవకాశం లేకుండా పోయిందని వివరిస్తున్నారు.

‘‘గాలిలో తేమ ఉండి, వాతావరణం వెచ్చగా ఉంటే ద్రవ్య బిందువులు వేగంగా కిందకు  పడిపోతాయి. కాబట్టి వైరస్ గాలిలో ఎక్కువ సేపు ఉండలేదు. దాని వల్ల వ్యాప్తి ఎక్కువగా జరగడానికి ఆస్కారమూ లేదు’’ అని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ డైనమిక్స్ డైరెక్టర్ ఎలిజబెత్ మెక్ గ్రా చెప్పారు.    

అయితే, భారత్ లోని కొన్ని నగరాల్లో కాలుష్యం ఎక్కువని, అది వైరస్ బతికేందుకు దోహదపడుతుందని మరికొందరు నిపుణులు వాదిస్తున్నారు. కాలుష్యం వల్ల జనాల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుందని, దాని వల్ల వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

అనుమానితుల గుర్తింపు

దేశంలో కరోనా అనుమానిత కేసుల గుర్తింపు కూడా చాలా పకడ్బందీగా జరిగిందని నిపుణులు చెబుతున్నారు. పంజాబ్ లో 76 శాతం మంది కరోనా పేషెంట్ల నుంచి ఒక్కరికి కూడా కరోనా సోకలేదని ఇటీవలీ ఓ సర్వేలో తేలింది. అలాగే చాలా రాష్ట్రాల్లోనూ జరిగిందని చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాలు మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ మెరుగైన సౌకర్యాలు కల్పించడం వల్ల కూడా కేసులు తగ్గాయని చెబుతున్నారు.

More Telugu News