Jagan: రేషన్ పంపిణీ వాహనదారులకు మరింత ఆదాయం... నెలకు రూ.21 వేలు అందించాలని సీఎం జగన్ నిర్ణయం

  • ఏపీలో ఇంటివద్దకే రేషన్.. పంపిణీ వాహనాలు సిద్ధం
  • వాహనదారులకు రూ.16 వేలు చెల్లించాలని మొదట నిర్ణయం
  • క్షేత్రస్థాయిలో వాహనదారులపై భారం పడుతోందన్న ప్రభుత్వం
  • అందుకే అదనంగా మరో రూ.5 వేలు పెంపు
CM Jagan decides to hike payment for ration mobile delivery vehicle owners

ఏపీలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేషన్ డెలివరీ కోసం మొబైల్ వాహనాలు కూడా సిద్ధం చేశారు. అయితే, ఈ రేషన్ పంపిణీ వాహనదారులకు నెలకు రూ.16 వేలు చెల్లించాలని మొదట నిర్ణయించారు. వాహనం బాడుగ కింద రూ.10 వేలు, ఇంధన ఖర్చులు రూ.3 వేలు, హెల్పర్ చార్జీల నిమిత్తం మరో రూ.3 వేలు చెల్లించాలని భావించారు.

అయితే, క్షేత్రస్థాయిలో వారిపై భారం పడుతోందని ప్రభుత్వం గుర్తించింది. దాంతో వారికి చెల్లించే నెల మొత్తాన్ని రూ.16 వేల నుంచి రూ.21 వేలకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. వాహనం బాడుగ రూ.10 వేల నుంచి రూ.13 వేలకు పెంచారు. హెల్పర్ చార్జీలను రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచారు. ఇంధన చెల్లింపుల్లో మాత్రం మార్పు లేదు. మొదట ప్రకటించిన మేరకు రూ.3 వేలు చెల్లిస్తారు.

అయితే, రేషన్ పంపిణీ వాహనాలు శుభ్రంగా లేకపోతే వారికి అందే చెల్లింపుల్లో కోత ఉంటుందని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. వాహనాలను ఎప్పటికప్పుడు తహసీల్దార్లు తనిఖీలు చేస్తుంటారని తెలిపింది.

More Telugu News