Ratan Tata: 'భారతరత్న' ప్రచారం ఆపండి... దేశానికి సేవ చేసే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తా: రతన్ టాటా

  • రతన్ టాటాకు 'భారతరత్న' ఇవ్వాలంటూ ప్రచారం
  • సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్
  • అన్నింటికంటే మొదట తాను భారతీయుడ్నని పేర్కొన్న రతన్ టాటా
 Ratan Tata responds over Bharataratna campaign

భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు 'భారతరత్న' ఇవ్వాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. డాక్టర్ వివేక్ బింద్రా అనే వ్యక్తి రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ను మరింత ముందుకు తీసుకెళుతున్నారు. 'భారతరత్న ఫర్ రతన్ టాటా' అనే హ్యాష్ ట్యాగ్ తో ఆయన సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. దేశ అత్యున్నత పురస్కారానికి రతన్ టాటా అర్హులేనంటూ పెద్ద సంఖ్యలో ఆ హ్యాష్ ట్యాగ్ పట్ల స్పందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రతన్ టాటా తన అభిప్రాయాలు వెల్లడించారు. తాను 'భారతరత్న' అవార్డు కంటే దేశానికి సేవ చేసే అవకాశం రావడాన్నే అదృష్టంగా భావిస్తానని తెలిపారు. తనకు 'భారతరత్న' ఇవ్వాలంటూ సాగుతున్న ప్రచారాన్ని నిలిపివేయాలని నెటిజన్లను కోరారు. "నాకు 'భారతరత్న' ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్న వారిని అభినందిస్తున్నా. కానీ, ఈ ప్రచారం ఆపేయాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అన్నింటికంటే ముందు నేను భారతీయుడిని. దేశ అభివృద్ధిలో నేను భాగం కావడాన్ని నాకు దక్కిన మహాభాగ్యంగా భావిస్తాను" అని రతన్ టాటా వినమ్రంగా తెలిపారు.

More Telugu News