కేసు విచారణకు హాజరు కాని ఎమ్మెల్యే సీతక్క.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

06-02-2021 Sat 10:12
  • నిన్న కోర్టుకు క్యూ కట్టిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
  •  ఎంపీ నామా, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డిలకు కోర్టు సమన్లు
  • సీతక్కపై వారెంట్‌ను ఈ నెల 9లోగా అమలు చేయాలని ఆదేశం
Nampally Court Issues Non Bailable Warrant against MLA Seethakka
ఓ కేసులో కోర్టు విచారణకు పదేపదే డుమ్మా కొడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 9వ తేదీలోపు వారెంట్‌ను అమలు చేయాలని ములుగు పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.

 అలాగే, వేర్వేరు కేసుల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, మచ్చా నాగేశ్వరావు నిన్న కోర్టుకు హాజరయ్యారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డిలకు కోర్టు సమన్లు జారీ చేసింది.

హెరిటేజ్ సంస్థ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు కోర్టుకు హాజరయ్యారు. ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావుపై నమోదైన మూడు కేసులను కోర్టు కొట్టివేసింది.