Visakhapatnam: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నాయకుల గొంతు ఎందుకు మూగబోతోంది?: మండలి బుద్ధప్రసాద్

Mandali Buddha Prasad Slams AP Leaders Over Visakha Steel Plant Privatisation
  • తెలుగువారిలో చేవ చచ్చిందా?
  • ఇది తెలుగువారికి జరుగుతున్న అవమానం
  • 32 మంది బలిదానంతో సాధ్యమైన పరిశ్రమను ప్రైవేటుకు కట్టబెడతారా?
  • మనం ఎన్నుకున్న ఎంపీలు మన కోసం పనిచేస్తారని అనుకోవడం అత్యాశే
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వార్తలపై ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో నాయకులు ఎవరూ మాట్లాడడం లేదని, వారి గొంతు ఎందుకు మూగబోతోందని నిలదీసిన ఆయన.. తెలుగువారిలో చేవ చచ్చిందా? అని ప్రశ్నించారు. మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు, పార్లమెంటు సభ్యులు మనకోసం ఆలోచిస్తారని, మన కోసం పనిచేస్తారని ఆశించడం అడియాసే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

స్వప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వారు గ్రహించేంత వరకు మన గతి ఇంతేనని అన్నారు. 32 మంది బలిదానాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమను ఓ ప్రాంతానికే పరిమితమైన అంశంగా చూడకూడదని బుద్ధ ప్రసాద్ అన్నారు. తెలుగువారి ఆత్మార్పణతో సాధించుకున్న ఈ పరిశ్రమను ప్రైవేటు పరం చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని తెలుగువారికి జరుగుతున్న అవమానంగా భావించాలని అన్నారు. దీనిని అడ్డుకోవడానికి ఆంధ్రులంతా మరోమారు ఉద్యమించాలని బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు.

ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ఊసేలేదని, ప్రత్యేక హోదా గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ, ఇతర విభజన హామీల గురించి కానీ ఒక్క మాట కూడా ఎక్కడా లేదని, అయినా ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని అన్నారు. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో జరిగిన ఉద్యమంలో తాను కూడా పాల్గొన్నానని ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్ గుర్తు చేశారు.

విశాఖపట్టణాన్ని మహానగరంగా మార్చి  వేలాదిమందికి ఉపాధి కల్పించిన పరిశ్రమను ప్రైవేటుకు ధారాదత్తం చేయాలనుకుంటుంటే నోళ్లు ఎందుకు మెదపడం లేదని బుద్ధ ప్రసాద్ ప్రశ్నించారు. జాతి కోసం ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని రాజకీయ పక్షాలన్నీ గుర్తించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
Visakhapatnam
Steel Plant
Privatisation
Mandali Buddha Prasad

More Telugu News