Pawan Kalyan: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ప్రధానిని కలుస్తాం: పవన్ కల్యాణ్

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • పెట్టుబడుల ఉపసంహరణ పరిధిలోకి ఉక్కు కర్మాగారం
  • కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న పవన్
  • ఇది తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని వెల్లడి
  • మన్మోహన్ హయాంలోనే దీనికి బీజం పడిందని వ్యాఖ్యలు
Pawan Kalyan says they will meet PM Modi for Visakha Steel Plant issue

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని, కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం పట్ల ఏపీలో క్రమంగా వాతావరణం వేడెక్కుతోంది. యాజమాన్య హక్కులను పూర్తిగా వదులుకోవడానికి కేంద్రం సిద్ధపడడం పట్ల రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా జనసేనాని పనవ్ కల్యాణ్ కూడా ఈ అంశంపై స్పందించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తామని పవన్ వెల్లడించారు. విశాఖ ఉక్కు ఏపీ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.

22 వేల ఎకరాల్లో విస్తరించిన ఈ కర్మాగారం 17 వేల మంది పర్మినెంటు ఉద్యోగులకు, 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు, లక్షమంది వరకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. ఇంతటి గొప్ప ప్లాంటు ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లిపోవడం జనసేన అభీష్టానికి వ్యతిరేకం అని పేర్కొన్నారు. నాడు ఈ కర్మాగారం కోసం లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారని, 32 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. త్యాగాల ఫలితంగా సాకారమైన ఉక్కు కర్మాగారం చేతులు మారుతోందంటే తెలుగువారికి ఆమోదయోగ్యం కాదని పవన్ స్పష్టం చేశారు. కేంద్రం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అసలు, పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించింది మన్మోహన్ సింగేనని ఆరోపించారు. ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే ఈ కర్మాగారం కూడా పెట్టుబడుల ఉపసంహరణ పరిధిలోకి వెళ్లిందని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వబోమని, కర్మాగారాన్ని కాపాడుకుంటామని ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News