రెండు రకాల కరోనా వ్యాక్సిన్లను కలిపి తీసుకుంటే..?: బ్రిటన్​ శాస్త్రవేత్తల అధ్యయనం

05-02-2021 Fri 14:12
  • 800 మంది వలంటీర్లపై ప్రయోగం
  • 13 నెలల పాటు పరిశీలన
  • ఆక్స్ ఫర్డ్, ఫైజర్ టీకాలతో ట్రయల్స్
  • వేసవి నాటికి తొలి దశ ఫలితాలు!
Can you mix vaccines UK trial aims to find out
ఓ రకం కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్నవారు.. వేరే రకం వ్యాక్సిన్ రెండో డోసు వేసుకోకూడదని అధికారులు ముందు నుంచీ చెబుతున్నారు. అయితే, ఇలా రెండు టీకాలను కలగాపులగం చేసి తీసుకుంటే ఏమవుతుంది? దాని వల్ల కలిగే దుష్ర్పభావాలు ఏంటి? ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయా? దీనిపైనే ఇప్పుడు బ్రిటన్ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు.

ఆక్స్ ఫర్డ్–ఆస్ట్రాజెనికా, ఫైజర్–బయోఎన్ టెక్ తయారు చేసిన రెండు కరోనా టీకాలను కలిపి ఆ దేశ ఆరోగ్య, సామాజిక భద్రత శాఖ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగా ట్రయల్స్ లో పాల్గొనబోతున్న 800 మంది వలంటీర్లకు వివిధ విరామాల్లో ఆ రెండు డోసుల టీకాలను విడివిడిగా ఇవ్వనున్నారు. వాటిని తీసుకున్న వారిని 13 నెలల పాటు పరిశీలించనున్నారు. అధ్యయనానికి సంబంధించి తొలి దశ ఫలితాలు వేసవి నాటికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ట్రయల్స్ లో భాగంగా కరోనా టీకా రెండు డోసుల మధ్య వ్యవధి 4 వారాలుంటే మంచిదా? 12 వారాలుంటే మంచిదా? అన్న విషయాన్నీ తేల్చనున్నారు. అధ్యయనానికి సంబంధించి ఫలితాలు వచ్చే వరకు వ్యాక్సినేషన్ పై ప్రస్తుతమున్న విధానమే అందుబాటులో ఉంటుందని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది.

ఇలా రెండు వేర్వేరు కంపెనీల టీకా డోసులను.. ఇచ్చి చూడడం ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సినాలజీ ప్రొఫెసర్ మాథ్యూ స్నేప్ అన్నారు. ఒకవేళ దాని వల్ల మంచి జరిగితే టీకా డెలివరీల్లో కొంత వరకు ఉపశమనం కలుగుతుందని చెప్పారు. కొత్త రకం కరోనాతో ఎలా పోరాడవచ్చో కూడా తెలుసుకోవచ్చని వివరించారు.