Nimmagadda Ramesh Kumar: ఏక‌గ్రీవాల వివరాలు అప్పుడే ప్రకటించవద్దంటూ కలెక్టర్లకు నిమ్మ‌గ‌డ్డ ఆదేశాలు!

  • చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో భారీ సంఖ్య‌లో ఏకగ్రీవాలు
  • ఆయా జిల్లాల కలెక్టర్లను నివేదిక కోరిన నిమ్మ‌గ‌డ్డ‌
  • ఇప్పటికిప్పుడు ఏకగ్రీవాలను ప్రకటించవద్దని ఆదేశాలు
nimmagadda asks report from collectors

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏక‌గ్రీవాల‌పై ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తోన్న వేళ‌.. వాటిని  రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప‌రిశీలిస్తోంది. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో భారీ సంఖ్య‌లో పంచాయతీలు ఏకగ్రీవం కావడంపై ఆయా జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్ర‌ధానాధికారి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ నివేదిక కోరారు.

ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న‌ పరిస్థితికి, ఆ రెండు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలకు పొంతన లేదని అభిప్రాయపడిన ఎలక్షన్ కమిషనర్.. ఇప్పటికిప్పుడు ఏకగ్రీవాలను ప్రకటించవద్దని ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు, గుంటూరు కలెక్టర్ల నుంచి  నివేదికలు పరిశీలించిన అనంత‌రం ఏక‌గ్రీవాల‌పై త‌దుప‌రి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కాగా, గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్న మధ్యాహ్నంతో ముగిసిన విష‌యం తెలిసిందే. అక్కడ 337 సర్పంచి స్థానాలకు గాను 67 స్థానాల్లో ఒక్కో నామినేషన్ చొప్పున‌‌ దాఖలు కావడంతో ఏకగ్రీవమయ్యాయి. వైసీపీ నేతలు గ్రామస్థాయిలో చ‌ర్చ‌లు జరిపి పంచాయతీల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేశారని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

మ‌రోవైపు, చిత్తూరు డివిజన్‌లో  ఇప్ప‌టివ‌ర‌కు 112 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం కావ‌డం గ‌మ‌నార్హం. వారిలో వైసీపీ మద్దతు ప‌లుకుతోన్న వారే  95 మంది ఉన్నారు. ఇక్క‌డి తొలి ద‌శలో మొత్తం 468 పంచాయతీలకుగాను 453 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. పూతలపట్టు నియోజక వర్గంలోని గ్రామాల్లో 152 సర్పంచుల పదవులకు గాను  49 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వాటిలో వైసీపీకి చెందిన వారు  40 మంది ఉన్నారు.

More Telugu News