Andhra Pradesh: ఢిల్లీ రైతులకు అమరావతి రైతుల మద్దతు.. సరిహద్దులో మార్మోగిన అమరావతి నినాదాలు

  • రైతు శిబిరాలను సందర్శించిన అమరావతి రైతులు
  • రైతు నాయకులు యోగేంద్రయాదవ్, దర్శన్‌పాల్‌ను కలిసి మద్దతు
  • రాజధాని విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా అమరావతి రైతులు తరలివెళ్లారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన అమరావతి రైతులు ఢిల్లీ శివారులో ఆందోళన చేస్తున్న రైతు శిబిరాలను సందర్శించారు. ఢిల్లీ, హరియాణా సరిహద్దులోని టిక్రి ప్రాంతంలో రైతు నాయకులు యోగేంద్రయాదవ్‌ను, ఢిల్లీ-పంజాబ్ సరిహద్దు సింఘు ప్రాంతంలో దర్శన్‌పాల్‌ను నిన్న కలిసి వారి పోరాటానికి మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా అక్కడి శిబిరాల్లో మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, విద్యుత్తు బిల్లు 2020ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోదీ రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారని, కానీ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మూడు రాజధానుల ప్రకటనతో తమ పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకుని అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అమరావతి అనుకూల నినాదాలతో హోరెత్తించారు.
Andhra Pradesh
Amaravati
Farmers
New Delhi

More Telugu News