Sireesha: ఆ సమయంలో అది శవంలా కనిపించలేదు, అందులో శివుడ్నే చూశా: ఎస్సై శిరీష

  • ఇటీవల యాచకుడి శవాన్ని మోసిన ఎస్సై శిరీష
  • అందరి అభినందనలు అందుకున్న వైనం
  • ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడి
  • తాను చేసే ప్రతి పనిలో దైవాన్ని చూస్తానని వ్యాఖ్యలు
  • 13 ఏళ్లకే పెళ్లి చేశారన్న మహిళా ఎస్సై
Kasibugga SI Sireesha talks to media

ఇటీవల ఓ యాచకుడి శవాన్ని పొలం గట్లపై అత్యంత ప్రయాసకోర్చి మోసుకొచ్చిన కాశీబుగ్గ ఎస్సై కె.శిరీష పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ శిరీష అనేక ఆసక్తికర అంశాలు వెల్లడించారు. డీఎస్పీ కావాలన్నదే తన కోరిక అని, అందుకోసం ఇప్పటికీ కష్టపడి చదువుతుంటానని తెలిపారు.

పొలాల్లో అనాథ శవం చూసిన తర్వాత మోసేందుకు ఎవరూ ముందుకు రాలేదని, తన సిబ్బంది కూడా వెనుకంజ వేశారని శిరీష పేర్కొన్నారు. వారు ఇష్టపూర్వకంగానే పనిచేయాలి తప్ప, తన కింది సిబ్బంది అని వారిని ఆదేశించడం తనకు నచ్చదని, అందుకే తానే ఆ శవాన్ని మోసుకొచ్చానని వివరించారు.

ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు విధి నిర్వహణలో భాగంగా అనేక పనులు చేస్తుంటామని, ప్రతి పనిలోనూ దైవాన్నే చూస్తానని అన్నారు. అందుకే దానిని శవంలా చూడలేదని, అందులో శివుడ్నే చూశానని వెల్లడించారు.

కాగా తనకు 13 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారని, తనకు తన భర్తకు 13 ఏళ్ల వయోభేదం ఉండడంతో కాపురంలో కలతలు వచ్చాయని తెలిపారు. బాల్య వివాహం కారణంగా ఆ దశలో ఏంచేయాలో తెలియక కొట్టుమిట్టాడానని, అయితే తన తండ్రి పరిస్థితిని అర్ధం చేసుకుని చదువుకునేందుకు ప్రోత్సహించారని శిరీష వివరించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో అనాథనని చెప్పి కాలేజీలో చేరానని, ఆ విధంగా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు.

More Telugu News