Madhavi Latha: ఎక్కడ అమ్మాయిలు పట్టుబడినా అది నేనే అని ప్రచారం చేస్తున్నారు: మాధవీలత

  • తెలుగు రాష్ట్రాల అధికార పక్షాలకు చెందినవారిపై మాధవీలత ఆగ్రహం
  • తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణ
  • ఏపీలో ఆలయాలపై దాడుల పట్ల పోరాడుతున్నానని వెల్లడి
  • అప్పటి నుంచి దుష్ప్రచారం తీవ్రమైందని వివరణ
  • సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు
Madhavi Latha complains to CP Sajjanar on social media hatred

టాలీవుడ్ నటి, బీజేపీ యువనేత మాధవీలత మీడియా ముందు ఆక్రోశం వెలిబుచ్చారు. తాను రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు చెందినవారు తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో తన పట్ల అసభ్యకర పోస్టులు పెడుతున్నారని వెల్లడించారు.

ఏపీలో దేవాలయాలపై దాడులు జరుగుతుండడం పట్ల తాను పోరాడుతున్నానని, అప్పటినుంచి తనను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న దుష్ప్రచారం ఎక్కువైందని తెలిపారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కు ఆమె ఫిర్యాదు చేశారు. దీని వెనుక ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మాధవీలత మీడియాతో మాట్లాడుతూ, తాను గతంలో గ్లామర్ పాటలు చేసింది చాలా తక్కువేనని, అయితే ఓసారి చీర కట్టుకుని గ్లామర్ సాంగ్ చేశానని, ఆ పాటలోని ఫొటోలను పోస్టు చేసి ఈమేనా హిందుత్వం గురించి మాట్లాడేది? అంటూ నీచంగా మాట్లాడుతున్నారని తెలిపారు.

సినిమా తారలు గ్లామర్ గా నటించక ఇంకే చేయాలి, మేం హిందువులకు పుట్టలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా వృత్తికి, నా మతానికి, నా వ్యక్తిత్వానికి ఏంటి సంబంధం? అని మాధవీలత ప్రశ్నించారు. ఎక్కడ అమ్మాయిలు పట్టుబడినా అది నేనే అని ప్రచారం చేస్తున్నారు అంటూ మాధవీలత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వ్యభిచారి అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.

More Telugu News