Face Transplantation: వైద్యరంగంలో విప్లవం... ప్రపంచంలోనే మొట్టమొదటి ముఖ, చేతుల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

  • 22 ఏళ్ల యువకుడి విషయంలో అమెరికా వైద్యుల ఘనత
  • రోడ్డు ప్రమాదంలో 80 శాతం వరకు కాలిన గాయాలు
  • గత ఏడాది శస్త్ర చికిత్స చేసిన 96 మంది నిపుణులు  
  • పూర్తిగా కోలుకున్న బాధితుడు.. అవయవ పనితీరు మెరుగు
New Jersey man gets first successful face and double hand transplant

ఆఫీసు నుంచి ఇంటికి వెళుతుంటే ఘోర కారు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి మొహం పూర్తిగా కాలిపోయింది. ఒంటి నిండా 80 శాతం కాలిన గాయాలయ్యాయి. బతకడు అన్న మాట నుంచి.. బతికి ఓ అద్భుతాన్నే సృష్టించాడతడు.

అయితే, పుట్టుకతో వచ్చిన మొహం లేదు..! పరిచయం లేని మొహంతో కొత్తగా ప్రపంచాన్ని పలకరిస్తున్నాడు. అవును, ప్రపంచంలోనే తొలి ‘ముఖ మార్పిడి’ శస్త్రచికిత్సను అమెరికా డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారు. బతుకు లేదనుకున్న వ్యక్తికి బతుకునిచ్చారు. ఆ కథేంటో ఇప్పుడు చదవండి...

జో డైమియో.. 22 ఏళ్ల వయసు. న్యూ జెర్సీలో నివాసం. 2018 జులైలో నైట్ షిఫ్ట్ డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళుతున్నాడు. బాగా అలసిపోయి వున్నాడేమో మెల్లగా నిద్రమత్తు ఆవహించింది.. కళ్లు మూతలుపడ్డాయి.. వెంటనే కళ్లు తెరిచి చూసే లోపు కారు పల్టీ కొట్టింది. భారీ శబ్దంతో పేలింది. ఆ మంటల్లో అతడు కాలిపోయాడు. చేతి వేళ్లు తెగిపోయాయి. పెదాలు చిట్లిపోయాయి. కనుబొమ్మలు గుర్తు లేకుండా చెరిగిపోయాయి. ముఖమంతా కాలిన గాయాలే. ఆ పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఆపద్బాంధవుడిలా వచ్చి జోను కాపాడి ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

అప్పటి నుంచి అతడికి న్యూయార్క్ లాంగోన్ హెల్త్ ఆసుపత్రి వైద్యులు ఎన్నెన్నో చికిత్సలు చేశారు. రెండున్నర నెలలు కృత్రిమ కోమాలో ఉంచి పలు శస్త్రచికిత్సలు నిర్వహించారు. ముఖం మార్చకపోతే లాభం లేదనుకున్నారు. దాత కోసం ప్రయత్నించారు. అంతకుముందే అతడికి కొన్ని టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో అతడికి సరిపోయే దాత దొరకడం కష్టమని తేలింది. కారణం, అతడి ప్రతిరక్షకాలు 94 శాతం దాతలను తిరస్కరించడమే. సరిపోయే దాత దొరికే అవకాశం కేవలం 6 శాతమే అని నిర్ధారించారు. అలా దేశమంతా వెతకగా అదృష్టం కొద్దీ అతడికి దాత దొరికాడు.

చివరికు గత ఏడాది ఆగస్టు 12న ఆసుపత్రి ముఖ మార్పిడి విభాగ డైరెక్టర్ ఎడ్వార్డో రోడ్రిగెజ్ నేతృత్వంలోని 96 మంది నిపుణుల బృందం 23 గంటలు కష్టించి ముఖ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతం చేసింది. దాంతో పాటు రెండు చేతులనూ అమర్చింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, బాధితుడి శరీరానికి తగ్గట్టు కొత్త ముఖం, చేతులు ప్రతిస్పందిస్తున్నాయని డాక్టర్ రోడ్రిగెజ్ చెప్పారు.

ఇంతకుముందు ఇలాంటివి రెండు శస్త్రచికిత్సలు జరిగినా అవి విఫలమయ్యాయని చెప్పారు. మొదటి కేసులో మొహం ఇన్ ఫెక్షన్ వచ్చి ఆ వ్యక్తి చనిపోయాడని, రెండో కేసులో చేతులు పెట్టినా పనిచేయలేదని, దీంతో మళ్లీ ఆ చేతులను తీసేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కాబట్టి ప్రపంచంలోనే విజయవంతమైన మొదటి ముఖ మార్పిడి శస్త్రచికిత్స ఇదేనని రోడ్రిగెజ్ తెలిపారు.

  • Loading...

More Telugu News