R Narayana Murthy: కేంద్ర బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన సినీ నటుడు నారాయణమూర్తి

  • తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది
  • ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు మాత్రమే కేటాయింపులు జరిగాయి
  • కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను కూల్చే ప్రయత్నం చేస్తోంది
Actor R Narayana Murthy criticises Union Budget

కేంద్ర బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి ఎదురైన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ పై సినీ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి పెదవి విరిచారు. డాక్టర్ స్వామినాథన్ ప్రతిపాదనల మేరకు బడ్జెట్ కేటాయిస్తే రైతులకు రుణాలు ఇవ్వాల్సిన అవసరమే లేదని చెప్పారు. బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలను విస్మరించారని అన్నారు. కేవలం ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ ను కేటాయించారని చెప్పారు. జీఎస్టీ, సెస్ లను కేంద్ర పరిధిలోకి తీసుకెళుతున్నారని... ఇలా అయితే రాష్ట్రాలు సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తాయని ప్రశ్నించారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కుప్పకూల్చే ప్రయత్నం చేస్తోందని కేంద్రంపై నారాయణమూర్తి మండిపడ్డారు. అన్నింటినీ ప్రైవేట్ పరం చేసే పనులు జరుగుతున్నాయని చెప్పారు. చివరకు పంచభూతాలను కూడా అమ్మేస్తారని... అప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని అన్నారు. ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో 'రైతు అన్న' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నెలాఖరులో గానీ, లేదా మార్చి ప్రథమార్థంలో కానీ సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.

More Telugu News