Viral Videos: మహారాష్ట్రలోని ఆసుప‌త్రిలోని రోగుల వార్డుల్లో య‌థేచ్ఛ‌గా తిరిగిన వీధి కుక్క‌లు.. వీడియో వైర‌ల్

  • మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో ఘ‌ట‌న‌
  • ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుప‌త్రిలోకి కుక్క‌లు
  • వీడియోపై విచార‌ణ జ‌రుపుతున్నామ‌న్న ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్‌

కొన్ని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో సిబ్బంది ఎంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తారో తెల‌ప‌డానికి ఉదాహ‌ర‌ణ‌గా ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. రోగులు ఉండే వార్డులో వీధి కుక్క‌లు తిరుగుతూ క‌న‌ప‌డ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. మహారాష్ట్ర నాగ్పుర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుప‌త్రిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు ఓ వీడియో ద్వారా తెలుస్తోంది.  

సిబ్బంది నిర్లక్ష్యం వ‌ల్లే ఆ కుక్క‌లు ఆసుప‌త్రిలోకి వ‌చ్చాయ‌ని, రోగుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నార‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. కుక్క‌లు లోప‌లికి రాకుండా అడ్డుకోవ‌డంలో విఫ‌లం కావ‌డ‌మే కాకుండా, ఆసుప‌త్రిలోకి వ‌చ్చిన కుక్క‌ల‌ను బ‌య‌ట‌కు కూడా పంప‌కుండా చాలా సేపు వైద్య సిబ్బంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరించిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై ఓ జాతీయ మీడియా అధికారుల‌ను ప్ర‌శ్నించింది.

త‌మ మెడికల్ కళాశాల ఆసుప‌త్రిలో కుక్క‌లు తిరిగిన‌ట్లు ఉన్న‌ వీడియో వైర‌ల్ అవుతోంద‌ని తాము ఈ రోజు ఉద‌యం తెలుసుకున్నామ‌ని ఆ జీఎంసీహెచ్ మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ అవినాశ్ గ‌వాండె చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై తాము విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని అన్నారు.

సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోన్న వీడియోపై నిజానిజాల‌ను తెలుసుకుంటామ‌ని చెప్పారు. దీనికి బాధ్యులైన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. క‌రోనా నేప‌థ్యంలో త‌మ ఆసుప‌త్రి సిబ్బంది తీరిక లేకుండా సేవ‌లు అందిస్తున్నార‌ని చెప్పారు. మెడికల్ కాలేజీ ఆసుప‌త్రుల‌పై ప్ర‌జ‌లు న‌మ్మ‌కాన్ని కోల్పోకుండాచ చూసుకోవ‌డం కూడా చాలా ముఖ్య‌మని తెలిపారు.

ఈ ఘ‌ట‌న నిజంగానే జ‌రిగితే సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు. తాము ప్ర‌తినెల ఆసుప‌త్రిలో రోగుల‌ భ‌ద్రతపై స‌మావేశాలు జ‌రుపుతామ‌ని, ఈ నెల కూడా జ‌రిపి, రెండు బృందాల‌ను ఏర్పాటు చేసి తనిఖీలు చేయాల‌ని చెప్పామ‌ని తెలిపారు. ఆసుప‌త్రిలోకి కుక్క‌లు నిజంగానే వ‌చ్చిన‌ట్లు తేలితే భ‌విష్య‌త్తులో సిబ్బంది మ‌రింత‌ అప్రమత్తంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.
  

More Telugu News