ICC: ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు న్యూజిలాండ్... ఆస్ట్రేలియా చలవే!

  • దక్షిణాఫ్రికాతో రద్దయిన ఆసీస్ టెస్ట్ మ్యాచ్ లు
  • టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో న్యూజిలాండ్
  • మరో స్థానం కోసం ఇండియా, ఆసీస్, ఇంగ్లండ్ మధ్య పోటీ
New Zeland is in ICC Test Campionship Finals

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ పోటీలు రద్దు కావడం న్యూజిలాండ్ కు కలిసి వచ్చింది. మరో మ్యాచ్ ఆడకుండానే కివీస్, టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించింది. గత సంవత్సరం కరోనా కారణంగా చాలా టెస్ట్ మ్యాచ్ లు రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం పాయింట్ల ఆధారంగా కాకుండా, ఆడిన టెస్టుల సంఖ్యను బట్టి ఫైనల్ బెర్త్ లను ఖరారు చేయాలని ఐసీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం న్యూజిలాండ్ పాయింట్ల శాతం 70గా ఉండగా, ఆసీస్, సౌతాఫ్రికా మ్యాచ్ లు రద్దు కావడంతో, టెస్ట్ చాంపియన్ షిప్ కు అర్హత సాధించిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఆ వెనుకే రెండో ప్లేస్ దాదాపుగా ఇండియాకు లభించినట్టేనని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. తుది పోరుకు అర్హత సాధించేది ఎవరన్న విషయం ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ తరువాత తేలుతుంది.

త్వరలో జరిగే సిరీస్ లో ఇండియా కనీసం 2-1 తేడాతో విజయం సాధించినా ఫైనల్ కు చేరిపోవచ్చు. ఇక వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ జూన్ 18 నుంచి 22 మధ్య జరగనుందన్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ జట్టు ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకోగా, మరో ప్లేస్ కోసం మూడు జట్లు పోటీలో ఉన్నట్టు లెక్క. ఇండియా ప్రస్తుతం 71.7 పాయింట్ల శాతంతో ఉండగా, కోహ్లీ సేన ఇంగ్లండ్ తో విజయం సాధిస్తే మరింకే గణాంకాలతో పని లేకుండా ఫైనల్ కు వెళుతుంది.

ఇక ఇంగ్లండ్ విషయానికి వస్తే, 68.7 శాతం పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అంటే, ఇండియాపై కనీసం మూడు టెస్టులను గెలిస్తే, ఫైనల్ కు ఆర్హత సాధించవచ్చు. ఈ సిరీస్ ఇండియాలో జరుగుతున్న నేపథ్యం, ఇటీవలి భారత క్రికెట్ జట్టు ప్రదర్శన గమనిస్తే, ఇది దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. ఆసీస్ కు కూడా అవకాశాలు ఇంకా పూర్తిగా ముగియలేదు. ప్రస్తుతం 69.2 పాయింట్ల శాతంతో ఆసీస్ ఉండగా, మరో టెస్ట్ ను మాత్రం ఆడటం లేదు.

ఈ నేపథ్యంలో ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగనున్న సిరీస్ ఫలితం ఆసీస్ భవిష్యత్తును తేల్చనుంది. ఇండియా 1-0 తేడాతో ఇంగ్లండ్ పై గెలిచినా, ఇంగ్లండ్ 1-0 లేదా 2-0 తేడాతో విజయం సాధించినా, సిరీస్ డ్రాగా ముగిసినా ఆసీస్ కు ఫైనల్ అవకాశాలుంటాయి.

More Telugu News