New Delhi: రైతుల దిగ్బంధం... వాటర్, టాయిలెట్ సౌకర్యాన్ని నిలిపివేసిన పోలీసులు!

No Access to Wanter and Toilets for Farmer Protesters
  • సింఘూ బార్డర్ వద్ద ఐదంచెల గోడలు
  • రైతుల కనీస అవసరాల నిలిపివేత
  • వెనక్కు తగ్గేది లేదన్న రైతు సంఘాలు
  • కొన్ని నీటి ట్యాంకర్లను పంపిన హర్యానా ప్రభుత్వం
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలకు ప్రధాన కేంద్రమైన సింఘూ బార్డర్ ను పోలీసులు దిగ్బంధించారు. రైతులకు మంచి నీటి సరఫరాను నిలిపివేయడంతో పాటు, వారు కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా వెళ్లే పరిస్థితి లేకుండా చేశారు. నాలుగు నుంచి ఐదడుగుల సిమెంట్ గోడలను నిర్మించిన పోలీసులు, సంయుక్త కిసాన్ మోర్చా నిరసనకారులకు ఢిల్లీతో ఎటువంటి సంబంధం లేకుండా చేశారు.

మొత్తం ఐదు వరుసల్లో బారికేడ్లను నిర్మించారు. 1.5 కిలోమీటర్ల దూరం పాటు వీటిని నిర్మించారు. రైతులు టాయిలెట్ అవసరాలను వినియోగించుకునేందుకు పదికి పైగా మొబైల్ టాయిలెట్ వాహనాలను అక్కడ ఏర్పాటు చేయగా, వాటి వద్దకు వెళ్లకుండా రైతులను నియంత్రించారు. ఢిల్లీ జల్ బోర్డు వారికి నిత్యమూ మంచినీటిని సరఫరా చేస్తుండగా వాటిని కూడా నిలిపివేశారు. వాహనాలు వెళ్లకుండా భారీ ఎత్తున అడ్డుగోడలు కట్టారు.

పోలీసుల చర్యలతో రైతులు అయోమయ పరిస్థితుల్లో పడినా, తామేమీ వెనుకంజ వేయబోమని, పోలీసుల చర్యలు తమ నిరసనలను ఆపలేవని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. "మేము రైతులము. మేము బావులు తవ్వకుంటాం. మా అవసరాలను మేమే తీర్చుకుంటాం. మా గురించి ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదు. మా గ్రామాలకు మేమిప్పుడు వెనక్కు తిరిగి వెళ్లే పరిస్థితి లేదు. మా భవిష్యత్తు, మా బిడ్డల భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా వెళతాం" అని రైతు సంఘం నేత కుల్జిత్ సింగ్ వ్యాఖ్యానించారు.

కాగా, రైతుల దైనందిన అవసరాలను తీర్చేందుకు హర్యానా ప్రభుత్వం కొన్ని వాటర్ ట్యాంకర్లను పంపించింది. కాలకృత్యాల అవసరాలను తీర్చేందుకు కొన్ని టాయిలెట్లు మాత్రమే ఇప్పుడు రైతులకు అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలా మంది, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, పారిశుద్ధ్య సమస్య ఏర్పడకుండా చర్యలు చేపట్టామని హర్యానా అధికారులు వెల్లడించారు.

New Delhi
Farmers
Protests
Water
Toilets

More Telugu News