Sajjanar: ఆ సినిమాలో రామ్ చరణ్ నిజమైన పోలీసులానే నటించారు: పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రశంసలు

Sajjanar heaps praise on hero Ram Charan
  • ముగిసిన సైబరాబాద్ పోలీసు క్రీడోత్సవాలు
  • ముగింపు సభకు విచ్చేసిన రామ్ చరణ్
  • రామ్ చరణ్ పై సజ్జనార్ ప్రశంసల జల్లు
  • రామ్ చరణ్ సినిమాలు చూశానని వెల్లడి
సైబరాబాద్ పోలీసుల వార్షిక క్రీడోత్సవాలు ముగిశాయి. ముగింపు వేడుకలకు టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీనిపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పందించారు. తాము పిలవగానే రామ్ చరణ్ మరేమీ ఆలోచించకుండా వచ్చారని, ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎంతో బిజీగా ఉన్న సమయంలోనూ తమ కోసం సమయం కేటాయించారని కొనియాడారు.

రాజమౌళి వంటి పెద్ద దర్శకుడు రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఒకరోజు వాయిదా వేయడం అంటే మామూలు విషయం కాదని సజ్జనార్ తెలిపారు. అంతేకాదు, షూటింగ్ లో తన పాత్ర మేకప్ ను తీసేయడానికి రెండుగంటల సమయం పట్టిందని రామ్ చరణ్ చెప్పారని, ఎంతో విలువైన సమయాన్ని పోలీసుల కోసం వెచ్చించారని సంతోషం వ్యక్తం చేశారు.

తాను సినిమాలు చాలా తక్కువగా చూస్తానని, తాను చివరిసారి చూసిన సినిమా చిరంజీవి నటించిన సైరా అని సజ్జనార్ వెల్లడించారు. తన భార్యాపిల్లలు కోరితే సైరా సినిమాకు వెళ్లామని చెప్పారు. తానేమీ సినిమా అభిమానిని కానని, అయితే రామ్ చరణ్ నటించిన మగధీర, ధృవ, రంగస్థలం చిత్రాలు చూశానని తెలిపారు. ధృవ చిత్రంలో రామ్ చరణ్ పోలీసు పాత్రను పోషించారని అన్నారు. దాదాపుగా నిజమైన పోలీసుగానే నటించారని సజ్జనార్ కితాబిచ్చారు.
Sajjanar
Ramcharan
Cyberabad
Police Sports
Hyderabad

More Telugu News